ఖర్చు తగ్గింపులో భాగంగా స్విగ్గీ కీలక నిర్ణయం!

by Disha Web Desk 17 |
ఖర్చు తగ్గింపులో భాగంగా స్విగ్గీ కీలక నిర్ణయం!
X

న్యూఢిల్లీ: ప్రముఖ ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్ ఖర్చులను తగ్గించే ప్రయత్నాల్లో భాగంగా తన క్లౌడ్ కిచెన్ వ్యాపారం స్విగ్గీ యాక్సెస్‌ను కిచెన్ఎట్‌కు విక్రయించినట్టు ఓ ప్రకటనలో వెల్లడించింది. ఇటీవలే స్విగ్గీ వ్యయ నియంత్రణలో భాగంగా 380 మంది ఉద్యోగులను తగ్గించింది. ఈ క్రమంలోనే అనుకున్న స్థాయిలో వ్యాపారం వృద్ధి చెందకపోవడంతో స్విగ్గీ యాక్సెస్‌ను విక్రయించినట్టు తెలిపింది.

ప్రస్తుత అనిశ్చిత పరిస్థితుల్లో లాభదాయకతపై ప్రభావం చూపే పరోక్ష ఖర్చులను సమీక్షిస్తున్నామని, అందులో భాగంగా సంస్థకు చెందిన స్థలాలు, మౌలిక వసతుల ఖర్చులను వీలైనంత తగ్గించే చర్యలు తీసుకున్నామని స్విగ్గీ సీఈఓ శ్రీహర్ష అన్నారు.

ఫుడ్ డెలివరీలకు డిమాండ్ ఉంటూనే రెస్టారెంట్లు అందుబాటులో లేని ప్రాంతాల్లో సేవలందించేందుకు 2017లో స్విగ్గీ యాక్సెస్‌ను సంస్థ ప్రారంభించింది. ఈ సదుపాయం ఉన్న ప్రాంతాల్లో రెస్టారెంట్లు తమ కిచెన్‌లను ఏర్పాటు చేసుకునేందుకు స్విగ్గీ అవకాశం కల్పించింది. దానివల్ల రెస్టారెంట్లు విస్తరించడానికి వీలుంటుంది. అందుకోసం స్విగ్గీ 2019 వరకు రూ. 250 కోట్ల పెట్టుబడులు పెట్టింది.

ఆ తర్వాత కరోనా కారణంగా ఈ విభాగంలో వ్యాపారం స్తంబించింది. మొదట్లో 14 నగరాల్లో స్విగ్గీ యాక్సెస్ మొదలవగా, ప్రస్తుతం ఇది నాలుగు నగరాలకు పరిమితమైంది. ఇక, ఇటీవల ఆర్థిక మాంద్యం ఆందోళనలు పెరిగిన నేపథ్యంలో స్విగ్గీ యాక్సెస్‌ను విక్రయించింది.



Next Story

Most Viewed