ప్రీమియం విభాగంలో అత్యధిక బైకులను విడుదల చేయనున్న హీరో మోటోకార్ప్!

by Disha Web Desk 23 |
ప్రీమియం విభాగంలో అత్యధిక బైకులను విడుదల చేయనున్న హీరో మోటోకార్ప్!
X

న్యూఢిల్లీ: దేశీయ అతిపెద్ద ద్విచక్ర వాహన తయారీ సంస్థ హీరో మోటోకార్ప్ ఈ ఏడాది అత్యధిక బైకులను భారత మార్కెట్లో విడుదల చేయనున్నది. ముఖ్యంగా ప్రీమియం బైక్ విభాగంలో మార్కెట్ వాటాను మరింత వేగవంతంగా పెంచుకునేందుకు ఈ ఆర్థిక సంవత్సరంలో కంపెనీ చరిత్రలోనే ఎక్కువ బైకులను విడుదల చేయనున్నామని హీరో మోటోకార్ప్ సీఈఓ నిరంజన్ గుప్తా అన్నారు. హీరో మోటోకార్ప్-హార్లె డేవిడ్‌సన్ భాగస్వామ్యంలో రాబోయే మొదటి బైకుతో పాటు కొత్త బైకులను తీసుకొస్తామన్నారు. ప్రస్తుతం కంపెనీ బడ్జెట్ విభాగం(100-110సీసీ)లో లీడర్‌షిప్‌ని కలిగి ఉంది. 125సీసీ విభాగంలో మెరుగైన వాటాను కొనసాగిస్తోంది. ఈ క్రమంలో ప్రీమియం విభాగం 160సీసీ, అంతకంటే ఎక్కువ విభాగంలో మరిన్ని బైక్ మోడళ్లను కలిగి ఉండటమే కాకుండా కంపెనీ లాభదాయకతను పెంచుకునేలా ప్రణాళికను సిద్ధం చేసినట్టు నిరంజన్ గుప్తా వివరించారు. ప్రధానంగా ప్రీమియం విభాగంలో ఎక్కువ బైకులను తీసుకొస్తామని, 150సీసీ నుంచి 450సీసీపై దృష్టి సారించినట్టు ఆయన తెలిపారు. మార్కెట్ వాటాతో పాటు మార్జిన్ పరంగా ఈ ఏడాది వృద్ధి గణనీయంగా ఉంటుందనే నమ్మకం ఉందని ఆయన పేర్కొన్నారు. ఇటీవల ఓ ప్రకటనలో కంపెనీ తన ఎలక్ట్రిక్ వాహనాల(ఈవీ) విభాగంలో వీదా బ్రాండ్‌ను దేశవ్యాప్తంగా సుమారు 100 నగరాలకు విస్తరించనున్నట్టు ప్రకటించింది.

Also Read..

భారత మార్కెట్లపై కొనసాగుతున్న విదేశీ మదుపర్ల విశ్వాసం!



Next Story

Most Viewed