ప్రారంభమైన డిజిటల్ రూపాయి!

by Disha Web Desk 17 |
ప్రారంభమైన డిజిటల్ రూపాయి!
X

ముంబై: భారతీయ రిజర్వ్ బ్యాంక్ రిటైల్‌ డిజిటల్‌ రూపాయి (ఈ-రూపీ)ని రిటైల్ విభాగంలో ప్రయోగాత్మకంగా గురువారం ప్రారంభించింది.మొదట నాలుగు నగరాల్లో దీన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించిన ఈ-రూపీని ముంబై, ఢిల్లీ, బెంగళూరు, భువనేశ్వర్‌లలో అమల్లోకి తెచ్చారు. అనంతరం రెండో దశలో హైదరాబాద్, ఇండోర్, గుహవాటి, కొచ్చి, పాట్నా, లక్నో, సింలా, గాంగ్‌టక్, అహ్మదాబాద్‌లకు విస్తరించనున్నట్టు ఆర్‌బీఐ తెలిపింది.

ప్రస్తుతానికి ఎస్‌బీఐ, ఐసీఐసీఐ, యెస్‌ బ్యాంక్‌, ఐడీఎఫ్‌సీ ఫస్ట్‌ బ్యాంక్‌లు ఈ-రూపీ లావాదేవీల్లో పాల్గొనగా, తర్వాతి దశలో మరో నాలుగు బ్యాంకులు కలవనున్నాయి. పైలట్ ప్రాజెక్టులో భాగంగా కొంతమంది వినియోగదారులను బ్యాంకులు ఎంపిక చేసి, వారి ఖాతా నుంచి నగదును సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ(సీబీడీసీ) వ్యాలెట్‌కు బదిలీ చేశాయి. ఈ సీబీడీసీ వ్యాలెట్‌లో ఉన్న సొమ్ము డిజిటల్ రూపీగా చలామణి అవనుంది.

ఈ-రూపీ లావాదేవీ నిర్వహించేందుకు బ్యాంక్ అకౌంట్ అవసరం లేదు. కాగా, నెలరోజుల క్రితం టోకు లావాదేవీల కోసం ప్రారంభించిన డిజిటల్ రూపాయి వల్ల పెద్ద ప్రయోజనాలేమీ కనిపించడంలేదని పలువురు బ్యాంకర్లు తెలిపారు. ఆర్‌బీఐ ఈ-రూపీ ఇంటర్నెట్ ఆధారిత బ్యాంకింగ్‌తో సమానంగా ఉందని ఏడుగురు బ్యాంకర్లు పేర్కొన్నారు. అయితే, ఇది ప్రారంభం మాత్రమే. భారత్‌లోని సీబీడీసీ పూర్తిగా పేపర్ కరెన్సీని భర్తీ చేయకపోవచ్చు. కానీ ప్రత్యామ్నాయంగా ఉండే అవకాశాలున్నాయని సీనియర్ బ్యాంకర్ ఒకరు తెలిపారు.


Next Story

Most Viewed