ఆరోగ్య బీమాలో మానసిక సమస్యలకు కవరేజీ లభిస్తుందా?

by Dishanational1 |
health insurance
X

దిశ, బిజినెస్ బ్యూరో : ఇటీవల ఓ ప్రైవేట్ సంస్థ అధ్యయనంలో భారత కంపెనీల్లో ఉద్యోగుల మానసిక సమస్యల కారణంగా లక్ష కోట్లకు పైగా నష్టం ఏర్పడుతున్నట్టు వెల్లడించింది. మానసిక కృంగుబాటుతో ఉద్యోగులు తరచూ సెలవులు పెట్టడం, ఉత్పాదకత తగ్గడం, ఉద్యోగాలు మారడం వంటి పరిణామాల వల్ల ఈ నష్టం వాటిల్లుతోందని అధ్యయనం పేర్కొంది. గతంలోనూ చాలామంది మానసిక ఒత్తిడి ఉన్నప్పటికీ, ఈ తరంలో అది గణనీయంగా పెరిగింది. ముఖ్యంగా కొవిడ్ మహమ్మారి తర్వాత ఇది మరింత తీవ్రమైంది. బీమా రంగ నియంత్రణ సంస్థ ఐఆర్‌డీఏఐ శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్య సమస్యలకు కూడా బీమా పాలసీలను అందించాలని గతంలో స్పష్టం చేసింది. ఎక్కువ మంది డిప్రెషన్, యాంగ్జయిటీ, అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్ (ఓసీడీ) వంటి సాధారణ మానసిక ఆరోగ్య సమస్యలతో పోరాడుతున్నారు. కాబట్టి మానసిక ఇబ్బందులకు కూడా అవసరమైన బీమా తీసుకోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.

2017లో ఐఆర్‌డీఏఐ మానసిక ఆరోగ్య సంరక్షణ చట్టాన్ని తీసుకొచ్చింది. దీనిపై బీమా కంపెనీలన్నిటికీ అవసరమైన మార్గదర్శకాలను కూడా జారీ చేసింది. బీమా కవరేజీకి సంబంధించి శారీరక సమస్యలనే కాకుండా మానసిక సమస్యలకు కూడా అందించాలని ఆదేశాలిచ్చింది. దాంతో అప్పటినుంచి ప్రతి ఆరోగ్య బీమా పాలసీలోనూ మానసిక సమస్యలు కూడా కవర్ అవుతూ వచ్చాయి. కానీ, ఈ సమస్యతో పాలసీదారుడు కనీసం 24 గంటలకు ముందు ఆసుపత్రిలో ఉంటేనే క్లెయిమ్ వరిస్తుంది.

ఐఆర్‌డీఏఐ సదుద్దేశంతో ఈ చట్టాన్ని తీసుకొచ్చినప్పటికీ వాస్తవంగా కవరేజీలో ఈ లక్ష్యాలు నెరవేరలేదు. ఆ తర్వాత ఐఆర్‌డీఏఐ 2022లో ఆదేశాలను మళ్లీ ముందుకు తెచ్చినప్పటికీ పరిస్థితులు మారలేదు. ఇతర శారీరక ఆరోగ్య సమస్యల తరహాలో కాకుండా మానసిక సమస్యలు దీర్ఘకాలానికి తీసుకునే చికిత్సలు కావడంతో బీమా కంపెనీలు సైతం ఈ విషయంలో ఎక్కువ ఉత్సాహం చూపించటంలేదు. ఆసుపత్రిలో అడ్మిట్ చేయడానికి సరైన కారణాలు చెప్పాలని బీమా కల్పించే కంపెనీలు పదేపదే కోరతాయి. ఇక ఆత్మహత్యాయత్నం వంటి సమయాల్లో బీమా వర్తించదని నిబందనలు చెబుతున్నాయి. దీంతో నిపుణులు సైతం మానసిక ఆరోగ్య సమస్యలకు క్లెయిమ్ చెల్లించడం అంత సులభమేమీ కాదని చెబుతున్నారు.

దీనికంటే ముందు మానసిక ఆరోగ్య సమస్యలకు పాలసీ కొనుగోళ్లు కూడా కష్టమేనని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఐఆర్‌డీఏఐ చట్టాన్ని తిరస్కరించలేనప్పటికీ, చాలామంది ఈ సమస్యలతో బాధపడుతున్న వారు మానసిక సమస్యలకు తీసుకునే చికిత్సలను కనీసం బయటకు చెప్పేందుకు ధైర్యం చేయడంలేదు. మానసిక ఆరోగ్య సమస్యల గురించి రికార్డుల్లో ఉండేందుకు వారు ఇష్టపడటంలేదని తెలిపారు.

ఎలాంటి సమస్యలకు బీమా వర్తిస్తుంది..

ఐఆర్‌డీఏఐ అన్ని మానసిక సమస్యలకు బీమా తప్పనిసరి చేసినప్పటికీ అన్నిటికీ ఇది వర్తించదు. అవి బీమా పాలసీలో కంపెనీలు ఇచ్చే హామీపై ఆధారపడి ఉంటాయి. పాలసీ కొనే సమయంలో ఏదైనా సమస్య ఉంటే బీమా వర్తించదు. ఎలాంటి మానసిక ఆరోగ్య సమస్యలకు వర్తించదనే విషయం బీమా కంపెనీలే వివరిస్తాయి. ఇవి కంపెనీలను బట్టి మారతాయి. కొన్ని కంపెనీలు వెయిటింగ్ పీరియడ్‌తో పాలసీని అందిస్తున్నాయి.

ఔట్‌పేషెంట్ డిపార్ట్‌మెంట్..

సాధారణ ఆందోళన, బెంగ, కృంగుబాటు లాంటి వాటికి ఔట్‌పేషెంట్ డిపార్ట్‌మెంట్(ఓపీడీ) కింద చికిత్స లభిస్తుంది. అంటే, విడిగా ఆసుపత్రిలో చేరి వైద్యుల పర్యవేక్షణలో చికిత్స తీసుకునే అవసరం ఉండదు. కానీ, చాలా బీమా పాలసీలు ఆసుపత్రిలో చికిత్స తీసుకునే వాటినే కవర్ చేస్తాయి. కొన్ని కంపెనీలు ఓపీడీ విధానానికి కూడా బీమా అందిస్తాయి, కానీ అధిక ప్రీమియం వసూలు చేస్తాయి. అదేవిధంగా సంబంధిత డాక్టర్ వద్ద చికిత్స తీసుకుంటేనే ఓపీడీ కవరేజ్ లభిస్తుంది. అయితే, ఎక్కువ మానసిక సమస్యలకు చికిత్స నిపుణుల పర్యవేక్షణలో జరుగుతాయి. అందుకోసం ఒక్కో సెషన్‌కు ఎక్కువ మొత్తం చెల్లించాల్సి వస్తుంది. ఓ సర్వేలో ఒక ఓపీడీ చికిత్స కోసం రూ. 60,000 నుండి రూ. 80,000 వరకు ఖర్చు అవుతుందని వెల్లడైంది. ఒక గంట నిడివి గల థెరపీ సెషన్‌కు రూ. 1,000 నుంచి రూ. 5,000 మధ్య ఖర్చవుతుంది.

మినహాయింపులు..

మానసిక ఆరోగ్య సమస్యలతో కూడిన పాలసీల్లో పుట్టినప్పటి నుంచే ఉన్న వాటిని మినహాయిస్తారు. మానసికంగా ఎదగకపోవడం, మెదడు సంబంధిత సమస్యలకు బీమా వర్తించదు.

Next Story

Most Viewed