నవంబర్‌లో రూ. 1.46 లక్షల కోట్ల జీఎస్టీ వసూళ్లు!

by Disha Web Desk 17 |
నవంబర్‌లో రూ. 1.46 లక్షల కోట్ల జీఎస్టీ వసూళ్లు!
X

న్యూఢిల్లీ: భారత వస్తు, సేవల పన్ను(జీఎస్టీ) ఆదాయం మరోసారి భారీగా నమోదయ్యాయి. ఈ ఏడాది నవంబర్ నెలకు సంబంధించిన జీఎస్టీ వసూళ్లు రూ. 1.46 కోట్లుగా నమోదైనట్టు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ గురువారం ఓ ప్రకటనలో వెల్లడించింది. గతేడాది ఇదే నెలలో వచ్చిన జీఎస్టీ వసూళ్లతో పోలిస్తే 11 శాతం పెరిగాయి. 2021, నవంబర్‌లో మొత్తం రూ. 1,31,526 కోట్ల జీఎస్టీ ఆదాయం నమోదైంది.

సమీక్షించిన నెలలో వచ్చిన జీఎస్టీ వసూళ్లు వరుసగా తొమ్మిదో నెలలో రూ. 1.40 లక్షల కోట్ల మార్కు దాటినట్టు ఆర్థిక మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. గత నెలలో జీఎస్టీ పన్ను వసూళ్లు పెరిగేందుకు ప్రధానంగా డిమాండ్ పుంజుకోవడం, అధిక వడ్డీ రేట్ల పరిణామాలు, దేశవ్యాప్తంగా రెండేళ్ల తర్వాత పండుగ, పెళ్లిళ్ల సీజన్ మద్దతు జీఎస్టీ ఆదాయం గణనీయంగా పెరిగేందుకు దోహదపడ్డాయి.

మంత్రిత్వ శాఖ వివరాల ప్రకారం, గత నెల మొత్తం వసూళ్లు రూ. 1,45,867 కోట్లుగా ఉన్నాయి. ఇందులో సీజీఎస్టీ రూ. 25,681 కోట్లు, ఎస్‌జీఎస్టీ రూ. 32,651 కోట్లు, ఐజీఎస్టీ ద్వారా రూ. 77,103 కోట్లు(వస్తువుల దిగుమతిపై వసూలైన రూ. 38,635 కోట్లతో కలిపి), సెస్ రూ. 10,433 కోట్లు(వస్తువుల దిగుమతిపై వసూలు చేసిన రూ. 817 కోట్లతో కలిపి) వసూలయ్యాయి.

తెలుగు రాష్ట్రాల్లో..

వస్తు, సేవల పన్ను ఆదాయంలో తెలుగు రాష్ట్రాలు మెరుగైన వృద్ధిని సాధించాయి. తెలంగాణలో గత నెల జీఎస్టీ వసూళ్లు రూ. 4,228 కోట్లతో 8 శాతం పెరిగాయి. గతేడాది ఇదే నెలలో తెలంగాణ జీఎస్టీ ఆదాయం రూ. 3,931 కోట్లుగా నమోదయ్యాయి. ఆంధ్రప్రదేశ్‌లో గత నెల రూ. 3,134 కోట్లు రాగా, ఇది గతేడాది అక్టోబర్‌లో వచ్చిన రూ. 2,750 కోట్ల కంటే 14 శాతం ఎక్కువని మంత్రిత్వ శాఖ వివరించింది.


Next Story

Most Viewed