రూ. 1.45 లక్షల కోట్ల జీఎస్టీ నోటీసులు జారీ చేసిన అధికారులు

by Gopi |
రూ. 1.45 లక్షల కోట్ల జీఎస్టీ నోటీసులు జారీ చేసిన అధికారులు
X

దిశ, బిజినెస్ బ్యూరో: వార్షిక రిటర్నులు, ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్ క్లెయిమ్‌లకు సంబంధించి డిసెంబర్‌లో 1500 కంపెనీలకు వస్తు, సేవల పన్ను(జీఎస్టీ) అధికారులు రూ. 1.45 లక్షల కోట్ల విలువైన నోటీసులను జారీ చేసినట్టు తెలిపారు. 2017-18 ఆర్థిక సంవత్సరం రిటర్నులకు సంబంధించి 2023, డిసెంబర్ 31 ఆఖరు తేదీ కావడంతో నోటీసుల సంఖ్య ఎక్కువగా ఉన్నాయని సీనియర్ అధికారి ఒకరు చెప్పారు. 'మొత్తం రూ. 1.45 లక్షల కోట్ల నోటీసుల్లో జరిమానా, వడ్డీ కలిపి ఉంటాయి. సమీక్షించిన కాలంలో మొత్తం 72.5 లక్షల జీఎస్టీ రిటర్నులు దాఖలవగా, అందులో కొంత భాగాన్ని పన్నుల సమీక్షకు తీసుకున్నట్టు' అధికారి వివరించారు. 2017-18కి సంబంధించిన నోటీసుల జారీకి గడువు ముగియడంతో 2018-19కి సంబంధించిన పన్ను నోటీసులపై దృష్టి సారిస్తామని, దీన్ని బట్టి నోటీసుల సంఖ్య మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయని అధికారులు వెల్లడించారు. పన్ను ఎగవేతల్లో రికవరీ బలహీనంగా ఉండటం కూడా నోటీసుల సంఖ్య ఎక్కువ ఉండేందుకు కారణమని పేర్కొన్నారు. అధికారిక గణాంకాల ప్రకారం, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దాదాపు రూ. 1.51 లక్షల కోట్ల జీఎస్టీ ఎగవేతలను కేంద్ర జీఎస్టీ అధికారులు గుర్తించారు. డిసెంబర్ 30 నాటికి రూ. 50 వేల కోట్ల రికవరీ లక్ష్యాన్ని నిర్దేశించగా, రూ. 18,541 కోట్లు మాత్రమే వచ్చాయని ఆర్థిక మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.

Next Story