బైజూస్ వ్యవహారంపై త్వరగా నివేదిక ఇవ్వాలని కేంద్రం ఆదేశాలు

by S Gopi |
బైజూస్ వ్యవహారంపై త్వరగా నివేదిక ఇవ్వాలని కేంద్రం ఆదేశాలు
X

దిశ, బిజినెస్ బ్యూరో: ఆర్థిక ఇబ్బందులకు తోడు వాటాదారుల ఒత్తిడి కారణంగా కష్టాల్లో ఉన్న ఎడ్‌టెక్ కంపెనీ బైజూస్ వ్యవహారంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. కంపెనీ అకౌంట్ బుక్స్ తనిఖీ చేయాలని ఆదేశించిన కేంద్ర కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, ఆ ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులకు తెలిపింది. ఆలస్యం చేయకుండా నివేదిక సమర్పించాలని స్పష్టం చేసినట్టు తెలుస్తోంది. నివేదిక ఆధారంగా కేంద్రం బైజూస్ విషయంపై తదుపరి చర్యల గురించి నిర్ణయం తీసుకోనుంది. గతేడాది జూలైలో బైజూస్ మాతృసంస్థ థింక్ అండ్ లెర్న్ అకౌంట్ బుక్స్‌ను తనిఖీ చేయాలని హైదరాబాద్ రీజనల్ డైరెక్టర్‌కు ఆదేశాలిచ్చిన సంగతి తెలిసిందే. ఆర్థిక ఫలితాలు ప్రకటించడంలో ఆలస్యం చేయడం, కంపెనీ ఆడిటర్ అయిన డెలాయిట్, స్టేట్‌మెంట్‌లను ఖరారు చేయలేకపోవడం వంటి పరిణామాలతో కేంద్రం నిర్ణయం తీసుకుంది. తాజాగా దీనికి సంబంధించి ప్రక్రియను వేగవంతం చేయాల్సిందిగా అధికారులను కోరింది. వీలైనత త్వరగా నివేదిక అందజేయాలని పేర్కొన్నట్టు ఉన్నతాధికారి ఒకరు సోమవారం ప్రకటనలో వెల్లడించారు.



Next Story