రూ. 7,017 కోట్లకు డీబీ పవర్‌ను కొనుగోలు చేసిన అదానీ!

by Disha Web Desk 17 |
Adani Group to Enter Aluminium Business
X

ముంబై: గౌతమ్ అదానీ నేతృత్వంలోని అదానీ గ్రూప్ అనుబంధ సంస్థ అదానీ పవర్ లిమిటెడ్ ప్రముఖ థర్మల్ పవర్ కంపెనీ డీబీ పవర్‌ను రూ. 7,017 కోట్లకు కొనుగోలు చేసినట్లు వెల్లడించింది. ఈ మేరకు శుక్రవారం రెగ్యులేటరీ ఫైలింగ్‌లో పేర్కొంది. ఛత్తీస్‌గఢ్‌లోని జిల్లా జాంజ్‌గిర్ చంపా వద్ద ఉన్న ఈ కంపెనీని కొనుగోలు చేయడం ద్వారా థర్మల్ పవర్ రంగంలో కార్యకలాపాలను విస్తరించాలని అదానీ పవర్ భావిస్తోంది.

డీబీ పవర్ కంపెనీ ఛత్తీస్‌గఢ్‌లో 600 మెగావాట్ల థర్మల్ పవర్ ప్లాంటులో రెండు యూనిట్లను నిర్వహిస్తోంది. డీబీ పవర్ ఆస్తులు డిలిజెంట్ పవర్‌ అనే హోల్డింగ్ కంపెనీ కింద ఉన్నాయి. ఇరు సంస్థల మధ్య జరిగిన ఈ లావాదేవీ కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా నుంచి ఆమోదం పొందటంతో పాటు డీపీపీఎల్, డీబీ పవర్‌కు సంబంధించిన సాధారణ ప్రక్రియల అనంతరం పూర్తవుతుందని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి.

డీబీ పవర్‌ను 2006లో స్థాపించారు. ఛత్తీస్‌గఢ్‌లో థర్మల్ పవర్ ఉత్పత్తి కేంద్రం ఏర్పాటు, నిర్వహణ కార్యకలాపాలను కలిగి ఉంది. కోల్ ఇండియా వంటి దిగ్గజ సంస్థతో 923.5 మెగావాట్ల కోసం దీర్ఘ, తాత్కాలిక విద్యుత్ కొనుగోలు ఒప్పందాలను కలిగి ఉంది.


Next Story

Most Viewed