రూ. 13 వేల కోట్లు వెనక్కి తీసుకెళ్లిన విదేశీ ఇన్వెస్టర్లు

by Dishanational1 |
రూ. 13 వేల కోట్లు వెనక్కి తీసుకెళ్లిన విదేశీ ఇన్వెస్టర్లు
X

దిశ, బిజినెస్ బ్యూరో: భారతీయ స్టాక్‌లు అధిక వాల్యుయేషన్‌కు చేరడం, అమెరికా బాండ్ల రాబడి పెరగడంతో ఈ ఏడాది మొదటి మూడు వారాల్లో విదేశీ ఇన్వెస్టర్లు రూ. 13,000 కోట్ల విలువైన పెట్టుబడులను వెనక్కి తీసుకెళ్లారు. ఈక్విటీ మార్కెట్ల నుంచి నిధులను ఉపసంహరించుకున్నప్పటికీ, డెట్ మార్కెట్‌పై మాత్రం ఆసక్తిగానే ఉన్నారు. జనవరిలో ఇప్పటివరకు రూ. 15,647 కోట్లను డెట్ మార్కెట్లో పెట్టారని డిపాజిటరీ గణాంకాలు వెల్లడించాయి. డేటా ప్రకారం, విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐ) జనవరి 19 వరకు రూ. 13,047 కోట్ల వరకు పెట్టుబడి పెట్టారు. జనవరి 17-19 మధ్య ఎఫ్‌పీఐలు రూ. 25,000 కోట్లకు పైగా నిధులను ఉపసంహరించుకున్నారు. అంతకుముందు నవంబర్‌లో రూ. 9,000 కోట్లు, డిసెంబర్‌లో రూ. 66,134 కోట్ల పెట్టుబడులు పెట్టిన ఎఫ్‌పీఐలు ఈ ఏడాది అమ్మకాలకు సిద్ధపడ్డారు. ప్రధానంగా ఇటీవల యూఎస్ 10 ఏళ్ల బాండ్ల రాబడి 3.9 శాతం నుంచి 4.15 శాతానికి పెరిగింది. అందుకే విదేశీ పెట్టుబడిదారులు భారత్ సహా అభివృద్ధి చెందుతున్న మార్కెట్ల నుంచి నిధులను వెనక్కి తీసుకుంటున్నారని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఇన్వెస్ట్‌మెంట్ స్ట్రాటజిస్ట్ వి కె విజయకుమార్ అన్నారు. దీనికితోడు భారత్‌లో షేర్ల వాల్యుయేషన్ అధికంగా ఉంది. గతవారమే హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ నుంచి ఆశించిన స్థాయిలో త్రైమాసిక ఫలితాలు రాకపోవడంతో పెద్ద ఎత్తున అమ్మకాలు జరిగాయని విజయకుమార్ వెల్లడించారు. మొత్తంగా 2023లో ఎఫ్‌పీఐలు ఈక్విటీల్లో రూ. 1.71 లక్షల కోట్లు, డెట్ మార్కెట్లో రూ. 68,663 కోట్ల పెట్టుబడులు పెట్టారు.

Next Story

Most Viewed