రూ. 51,200 కోట్లతో 20 నెలల గరిష్ఠానికి విదేశీ పెట్టుబడులు!

by Disha Web Desk 16 |
రూ. 51,200 కోట్లతో 20 నెలల గరిష్ఠానికి విదేశీ పెట్టుబడులు!
X

ముంబై: భారత ఈక్విటీ మార్కెట్ల నుంచి వరుస నెలల్లో నిధులను ఉపసంహరించుకున్న విదేశీ పెట్టుబడిదారులు గత ఒకటిన్నర నెలగా తిరిగి పెట్టుబడులు పెంచారు. ఆగష్టులో రిస్క్ సెంటిమెంట్, చమురు ధరల స్థిరీకరణ వంటి పరిణామాల మధ్య విదేశీ పోర్ట్‌ఫోలియో పెట్టుబడిదారులు(ఎఫ్‌పీఐ) భారత ఈక్విటీల్లో రూ. 51,200 కోట్ల పెట్టుబడులు పెట్టారు. ఇది 20 నెలల్లోనే అత్యధికమని డిపాజిటరీ గణాంకాలు చెబుతున్నాయి. అంతకుముందు జూలైలో ఎఫ్‌పీఐలు దాదాపు రూ. 5,000 కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేశారు. 2021, అక్టోబర్ నుంచి తొమ్మిది నెలల పాటు ఎఫ్‌పీఐలు మొత్తం రూ. 2.46 లక్షల కోట్లను ఉపసంహరించుకున్నారు.

ఆ తర్వాత జూలైలో మొదటిసారిగా కొనుగోళ్లను ప్రారంభించారు. ప్రస్తుత పరిస్థితుల్లో భారత మార్కెట్లపై విదేశీ పెట్టుబడిదారులు ఆసక్తిగా ఉన్నారు. అమెరికా ఫెడ్ వడ్డీ రేట్ల పెంపును కొనసాగించనుండంతో ఆగష్టు నెలతో పోలిస్తే పెట్టుబడుల వేగం తగ్గినప్పటికీ ప్రస్తుత నెలలోనూ ఎఫ్‌పీఐ నిధుల రాక కొనసాగుతుందని మార్కెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అధిక ద్రవ్యోల్బణం, డాలర్ మారకం, వడ్డీ రేట్ల పెంపు వంటి అంశాలు ఎఫ్‌పీఐలను ప్రభావితం చేస్తాయని నిపుణులు పేర్కొన్నారు. డిపాజిటరీల గణాంకాల ప్రకారం ఆగష్టులో భారతీయ ఈక్విటీల్లోకి ఎఫ్‌పీఐలు రూ. 51,204 కోట్లను ఇన్వెస్ట్ చేశారు. 2020, డిసెంబర్‌లో వచ్చిన రూ. 62,016 కోట్ల తర్వాత ఇదే అత్యధికం.


Next Story

Most Viewed