ఆగస్టులో తగ్గిన విదేశీ పెట్టుబడులు!

by Disha Web Desk 1 |
ఆగస్టులో తగ్గిన విదేశీ పెట్టుబడులు!
X

ముంబై : భారత ఈక్విటీ మార్కెట్లలో వరుసగా మూడు నెలల పాటు పెట్టుబడులు కొనసాగించిన విదేశీ మదుపర్లు ఆగస్ట్ లో తగ్గించారు. ద్రవ్యోల్బణ ఆందోళనలు, ముడి చమురు ధరలు పెరగడం వంటి పరిణామాల మధ్య ఆగష్టులో విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐ) రూ.12 వేల కోట్లకు తగ్గించారు. పూర్తిగా నిధుల సంహరణ కంటే వేచి ఉండే ధోరణిని ఎఫ్‌పీఐలు అనుసరిస్తున్నారని నిపుణులు అభిప్రాయపడ్డారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో అనిశ్చితి నెలకొంది. పరిస్థితులు వేగంగా మారుతున్న నేపథ్యంలో ఎఫ్‌పీఐ పెట్టుబడులపై ప్రభావం ఉంటుందని మార్నింగ్ స్టార్ ఇండియా రీసెర్చ్ మేనేజర్ హిమాన్షు శ్రీవాస్తవ తెలిపారు.

డిపాజిటరీ గణాంకాల ప్రకారం, ఆగష్టులో రూ.12,262 కోట్ల ఎఫ్‌పీఐ పెట్టుబడులు నమోదయ్యాయి. అంతకు ముందు వరుసగా మూడు నెలల పాటు ఎఫ్‌పీఐ రూ.40 వేల కోట్ల కంటే ఎక్కువ పెట్టుబడులతో మార్కెట్ల ర్యాలీకి కారణమయ్యారు. దీంతో ఆగస్ట్ లో గడిచిన నాలుగు నెలల్లోనే తక్కువ ఎఫ్‌పీఐ పెట్టుబడులుగా నమోదయ్యాయి. ఈ ఏడాది మేలో రూ.43,838 కోట్లు, జూన్‌లో రూ.47,148 కోట్లు, జూలైలో రూ.46,618 కోట్ల ఎఫ్‌పీఐ నిధులు దేశీయ ఈక్విటీల్లోకి వచ్చాయి. సమీక్షించిన నెలలో విదేశీ మదుపరులు కేపిటల్ గూడ్స్, హెల్త్‌కేర్ రంగాల్లో ఎక్కువగా షేర్లు కొనుగోలు చేశారు.

Next Story