కొత్త పన్ను విధానాన్ని సమీక్షించే యోచనలో ఆర్థిక మంత్రిత్వ శాఖ!

by Disha Web Desk 7 |
కొత్త పన్ను విధానాన్ని సమీక్షించే యోచనలో ఆర్థిక మంత్రిత్వ శాఖ!
X

న్యూఢిల్లీ: 2020-21 అర్థిక సంవత్సరం కేంద్ర బడ్జెట్‌లో ప్రభుత్వం కొత్త పన్ను విధానాన్ని ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. పాత పన్నుల విధానాన్ని కొనసాగిస్తూనే, కొత్త విధానాన్ని తీసుకొచ్చింది. పన్ను చెల్లింపుదారులు ఇందులో ఏదొకదాన్ని ఎంచుకునే అవకాశం కల్పించింది. అయితే, చాలామంది పాత విధానంలోనే ఇప్పటికీ పన్నులు చెల్లిస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా కేంద్రం వ్యక్తిగత ఆదాయపు పన్ను చెల్లింపుదారులను కొత్త విధానంవైపునకు ఆకర్షించేలా ఆర్థిక మంత్రిత్వ శాఖ సమీక్ష నిర్వహిస్తున్నట్టు పీటీఐ వర్గాలు పేర్కొన్నట్టు ఎకనమిక్ టైమ్స్ తెలిపింది.

దీర్ఘకాలంలో మినహాయింపులు, తగ్గింపులు లేని కొత్త పన్నుల వ్యవస్థను పూర్తిస్థాయిలో అమలు చేయాలని, సంక్లిష్టమైన పాత పన్ను విధానాన్ని క్రమంగా తొలగించాలని ప్రభుత్వం భావిస్తోంది. కొత్త పన్ను విధానంలో వివిధ మినహాయింపులు, తగ్గింపులు తొలగించి, తక్కువ పన్ను రేట్లను అందించడం ద్వారా ఆదాయపు పన్ను చెల్లింపుదారులు కొత్త విధానానికి మారేలా అవకాశం ఇవ్వాలని కేంద్రం చూస్తోంది. వ్యక్తిగత పన్ను చెల్లింపుదారులకు గణనీయమైన ఉపశమనం, ఆదాయపు పన్ను చట్టాన్ని సరళీకృతం చేయడం ద్వారా దీన్ని సాధించాలని ప్రభుత్వం భావిస్తోంది. కాగా, 2020, ఫిబ్రవరిలో తెచ్చిన కొత్త వ్యక్తిగత పన్ను విధానంలో రూ. 2.5 లక్షల వరకు ఆదాయం ఉన్నవారు ఎలాంటి పన్ను చెల్లించక్కరలేదు. రూ. 2.5 లక్షల నుంచి రూ. 5 లక్షల ఆదాయం ఉన్న వారికి 5 శాతం పన్ను ఉంటుంది. రూ. 5-7.7 లక్షల ఆదాయం వారు 10 శాతం, రూ. 7.5-10 లక్షల మధ్య ఉంటే 15 శాతం, రూ. 10-12.5 లక్షలు ఉంటే 20 శాతం, రూ. 12.5-15 లక్షల మధ్య ఉంటే 25 శాతం, రూ. 15 లక్షలకు పైన ఉంటే 30 శాతం పన్ను అమలవుతోంది.

Next Story

Most Viewed