సరికొత్త కీ-చెయిన్‌తో చెల్లింపుల విధానం తీసుకొచ్చిన ఫెడరల్ బ్యాంక్

by Dishanational1 |
సరికొత్త కీ-చెయిన్‌తో చెల్లింపుల విధానం తీసుకొచ్చిన ఫెడరల్ బ్యాంక్
X

దిశ, బిజినెస్ బ్యూరో: ప్రముఖ ప్రైవేట్ రంగ ఫెడరల్ బ్యాంకు సరికొత్త చెల్లింపుల విధానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. పెరుగుతున్న టెక్నాలజీ వినియోగానికి అనుగుణంగా 'ఫ్లాష్‌పే' పేరుతో రూపే స్మార్ట్ కీ-చెయిన్‌ను విడుదల చేసింది. ఈ స్మార్ట్ కీ-చెయిన్ ద్వారా కస్టమర్లు కాంట్రాక్ట్ లెస్ చెల్లింపులు చేయవచ్చని, ప్రస్తుతం డెబిట్, క్రెడిట్ కార్డులను ఉపయోగించి చేస్తున్న ట్యాప్ అండ్ పే తరహాలోనే ఇది కూడా పనిచేయనున్నట్టు బ్యాంకు ఓ ప్రకటనలో తెలిపింది. ఇలాంటి చెల్లింపుల పరికరాన్ని తీసుకురావడం పరిశ్రమలో మొట్టమొదటిదని బ్యాంకు అభిప్రాయపడింది. చిన్న కీ-చెయిన్‌ను వెంట తీసుకెళ్లడం ద్వారా సులభంగా చెల్లింపులను పూర్తి చేయవచ్చు. కస్టమర్‌లు పిన్ లేకుండా రూ.5000 వరకు కాంటాక్ట్‌లెస్ లావాదేవీలను నిర్వహించవచ్చు. ఈ పరిమితికి మించిన మొత్తాలకు పిన్ అవసరం ఉంటుంది. ఏదైనా పీఓఎస్ టెర్మినల్‌లో రోజువారీ లావాదేవీ పరిమితి రూ. 1,00,000 వరకు చెల్లింపులు చేసేందుకు వీలుంటుంది. ఫ్లాష్‌పే రూపే స్మార్ట్‌కీ చెయిన్ ఉండటం వల్ల బయటకు వెళ్లిన సమయంలో డెబిట్, క్రెడిట్ కార్డును విడిగా తీసుకెళ్లాల్సిన అవసరం ఉండదని బ్యాంకు వెల్లడించింది. దీనికోసం నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎన్‌పీసీఐ) భాగస్వామ్యంతో స్మార్ట్ కీ-చెయిన్‌ను తీసుకొచ్చినట్టు పేర్కొంది. ఫెడరల్ బ్యాంకు తెచ్చిన రూపే స్మార్ట్ కీ-చెయిన్ కాంపాక్ట్ డిజైన్‌తో, రోజువారీగా జేబులో తీసుకెళ్లెందుకు సులభంగా తయారు చేయబడింది. టోకనైజేషన్, ఎన్‌క్రిప్షన్ వంటి ఇన్-బిల్ట్ భద్రతా చర్యలతో రూపొందించబడిందని బ్యాంకు వివరించింది.

స్మార్ట్ కీ-చెయిన్ కావాలంటే..

ఫెడరల్ బ్యాంకు వినియోగదారులకు ఇది జారీ చేయడం జరుగుతుంది. సేవింగ్స్ లేదా కరెంట్ అకౌంట్ ఉన్నవారు నెట్ బ్యాంకింగ్‌లో స్మార్ట్ కీ-చెయిన్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఆ తర్వాత బ్యాంకు మొబైల్ యాప్, నెట్ బ్యాంకింగ్, ఐవీఆర్ కాలింగ్ ద్వారా పిన్ నంబర్ సెట్ చేసుకోవాలి. డెబిట్, క్రెడిట్ కార్డు లాగే ఎప్పుడైనా బ్లాక్, అన్‌బ్లాక్ చేసుకునే వీలుంటుంది. దీని ధరను రూ. 499గా నిర్ణయించామని, ఆ తర్వాత ఏడాదికి రూ. 199 ఛార్జీలు ఉంటాయని బ్యాంకు తెలిపింది. పన్నులు అదనం. రోజుకు 5 లావాదేవీలకు అనుమతి ఉంటుంది.

Next Story

Most Viewed