ట్విట్టర్ కొనుగోలు ఖాయమైనట్టే!

by Disha Web Desk 17 |
ట్విట్టర్ కొనుగోలు ఖాయమైనట్టే!
X

వాషింగ్టన్: ప్రపంచ అత్యంత సంపన్నుడు, స్పేస్ఎక్స్ అధినేత ఎలన్ మస్క్ ట్విట్టర్ కొనుగోలు దాదాపు ఖాయమైనట్లు తెలుస్తోంది. శుక్రవారం నాటికి ఒప్పందం పూర్తి చేయనున్నట్లు ఇప్పటికే పెట్టుబడిదారులకు స్పష్టం చేసిన మస్క్, గురువారం దీనికి సంబంధించి ఆసక్తికరమైన ట్వీట్ చేశారు.

ట్విట్టర్ కొనుగోలు పూర్తయిందనే విషయాన్ని సూచిస్తూ 'లెట్ దట్ సింక్ ఇన్ ' అనే మాటను జోడించి, సింక్‌ని ట్విట్టర్ కార్యాలయంలోకి తీసుకొస్తున్న వీడియోను పోస్ట్ చేశారు. అంతేకాకుండా తన ట్విట్టర్ బయోలో 'చీఫ్ ట్విట్' గా మార్చారు. అలాగే, ట్విట్టర్ కొనుగోలు చేయడానికి ప్రేరణకు సంబంధించి వివరమైన లేఖను పోస్ట్ చేశారు.

అందులో, 'తాను ట్విటర్‌ను ఎందుకు కొనుగోలు చేశాను, ప్రకటనల గురించి తానేమనుకుంటున్నాను అనే అంశాలపై అనేక ఊహాగానాలు ఉన్నాయి. వాటిలో చాలావరకు అవాస్తవాలే. భవిష్యత్తు నాగరికతకు కామన్ డిజిటల్ టౌన్ స్క్వేర్ ఉండటం ఎంతో ముఖ్యమని భావించే ట్విట్టర్‌ను కొనాలని నిర్ణయించాను. ఇది మానవాళికి ఎంతో సహాయపడుతుంది. హింసకు తావు లేకుండా, ఇక్కడ అనేక విశ్వాసాలను అనువైన పద్దతిలో చర్చించవచ్చు. ట్విటర్ ప్లాట్‌ఫామ్ అందరినీ స్వాగతించేలా ఉంటుందని ' చెప్పారు.

ఇదే సమయంలో, తాను ట్విట్టర్ యజమానిగా మారిన వెంటనే భారీ సంఖ్యలో ఉద్యోగులను తొలగించనున్నట్లు వస్తున్న వార్తలను ఎలన్ మస్క్ ఖండించినట్టు సమాచారం. వార్తల్లో వస్తున్నట్టు తాను 75 శాతం ఉద్యోగులను తొలగించనని స్పష్టం చేసినట్టు బ్లూమ్‌బర్గ్ తెలిపింది. ట్విట్టర్ కార్యాలయానికి వెళ్లిన సమయంలో దీనికి సంబంధించి ఉద్యోగులకు హామీ ఇచ్చారని తెలుస్తోంది.

కాగా, ట్విట్టర్‌ను కొనడం గురించి స్పష్టమైన నిర్ణయం తీసుకోవాలని, అందుకు అక్టోబర్ 28 వరకు కోర్టు గడువు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ మేరకు కొనుగోలు ప్రక్రియను పూర్తి చేయడానికి ఎలన్ మస్క్ ప్రయత్నిస్తున్నారు. 13 బిలియన్‌ డాలర్ల రుణాల కోసం ఈ మధ్యనే బ్యాంకర్లతో భేటీ అయిన మస్క్, తాజాగా ట్విటర్‌ కార్యాలయానికి వెళ్లారు.

దీంతో 44 బిలియన్ల డాలర్ల ట్విట్టర్ కొనుగోలు ఒప్పందాన్ని ముగించడానికి సిద్ధంగా ఉన్నట్టు స్పష్టమైంది. అయితే, దీనికి సంబంధించి అధికారికంగా ఎలన్ మస్క్ నుంచి గానీ, ట్విట్టర్ నుంచి గానీ ఇంకా ప్రకటన వెలువడలేదు.



Next Story

Most Viewed