- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Economy: భారత వృద్ధి అంచనాల్లో కోత విధించిన ఫిచ్
పెరుగుతున్న చమురు ధరలు, వాటి ప్రభావంతో అధిక ద్రవ్యోల్బణం వినియోగదారుల కొనుగోలు శక్తిని దెబ్బతీస్తాయని, ఫలితంగా సెప్టెంబర్, డిసెంబర్ త్రైమాసికాల్లో ఆర్థిక కార్యకలాపాలు మందగించే అవకాశం ఉందని పేర్కొంది.

దిశ, బిజినెస్ బ్యూరో: అమెరికా-ఇరాన్ ఘర్షణతో ప్రపంచ ఇంధన మార్కెట్లలో ఏర్పడిన అనిశ్చితి భారత్ ఆర్థిక వృద్ధిపైనా ప్రభావం చూపనుందని ఫిచ్ రేటింగ్స్ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి భారత జీడీపీ వృద్ధి అంచనాను 6.7 శాతం నుంచి 6.4 శాతానికి తగ్గిస్తున్నట్టు ఫిచ్ రేటింగ్స్ తెలిపింది. పెరుగుతున్న చమురు ధరలు, వాటి ప్రభావంతో అధిక ద్రవ్యోల్బణం వినియోగదారుల కొనుగోలు శక్తిని దెబ్బతీస్తాయని, ఫలితంగా సెప్టెంబర్, డిసెంబర్ త్రైమాసికాల్లో ఆర్థిక కార్యకలాపాలు మందగించే అవకాశం ఉందని పేర్కొంది. అయితే దేశీయ డిమాండ్, పెట్టుబడుల వ్యయం వృద్ధికి దోహదపడతాయని, దిగుమతులు తగ్గడం వల్ల గ్లోబల్ ట్రేడ్ నుంచి కూడా కొంత మద్దతు లభిస్తుందని ఫిచ్ అభిప్రాయపడింది. ఆర్‌బీఐ కూడా వృద్ధి అంచనాలను తగ్గించి, ద్రవ్యోల్బణ అంచనాలను పెంచిన నేపథ్యంలో ఫిచ్ నివేదిక చర్చనీయాంశమైంది.
ప్రపంచవ్యాప్తంగా చమురు సరఫరాపై ఒత్తిడి పెరగడంతో 2026 సంవత్సరానికి బ్రెంట్ క్రూడ్ ధర అంచనాను బ్యారెల్‌కు 70 డాలర్ల నుంచి 87 డాలర్లకు ఫిచ్ పెంచింది. దీని ప్రభావంతో భారత్‌లో ద్రవ్యోల్బణం రాబోయే నెలల్లో క్రమంగా పెరిగి ఏడాది చివరికి 5.3 శాతానికి చేరవచ్చని అంచనా వేసింది. తక్కువ వర్షపాతం ఉండే అవకాశాలు, కొన్ని ప్రాంతాల్లో కొనసాగుతున్న వడగాల్పులు కూడా ధరల పెరుగుదల రిస్క్‌ని మరింత పెంచుతున్నాయని పేర్కొంది. ఈ పరిస్థితుల్లో ద్రవ్యోల్బణాన్ని అదుపులో ఉంచేందుకు ఆర్‌బీఐ ఈ ఏడాది మరోసారి వడ్డీ రేట్లను పెంచే అవకాశం ఉందని ఫిచ్ వెల్లడించింది.






