2025 నాటికి దేశవ్యాప్తంగా ఇథనాల్ కలిపిన పెట్రోల్ పంపులు!

by Harish |
2025 నాటికి దేశవ్యాప్తంగా ఇథనాల్ కలిపిన పెట్రోల్ పంపులు!
X

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఇ20 పెట్రోల్‌ను విక్రయించే ఇంధన పంపుల సంఖ్యను పెంచే చర్యలు చేపడుతున్నట్టు కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్‌ సింగ్‌ పురి అన్నారు. పెట్రోల్‌లో 20 శాతం ఇథనాల్‌ను కలిపి విక్రయించే పెట్రోల్‌ను ఇ20గా పరిగణిస్తారు. 2025 నాటికి దేశవ్యాప్తంగా ఇ20 పంపులను అందుబాటులోకి తీసుకొస్తామని ఆయన తెలిపారు. ఈ ఏడాది ఫిబ్రవరి మొదటి వారం నుంచి ఇ20 పెట్రోల్ పంపులను ప్రారంభించామని, ఇప్పటివరకు మొత్తం 600 అందుబాటులో ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. మరో రెండేళ్లలో దేశంలోని అన్ని ప్రాంతాల్లో వీటిని విస్తరిస్తామని స్పష్టం చేశారు.

శుక్రవారం పరిశ్రమ ఐఎంసీ ఛాంబర్ ఏజీఎం సమావేశం సందర్భంగా కేంద్ర మంత్రి పై విధంగా స్పందించారు. 2013-14 సమయంలో పెట్రోల్‌లో ఇథనాల్ వాటా 1.53 శాతం నుంచి ఈ ఏడాది మార్చి నాటికి 11.5 శాతానికి పెరిగింది. పరిమాణం పరంగా ఇథనాల్ కలిపిన పెట్రోల్ 38 కోట్ల లీటర్ల నుంచి 2021-22 నాటికి 433.6 కోట్లకు చేరింది. బయో ఫ్యూయెల్ ఇంధనాన్ని విక్రయించే పెట్రోల్ పంపుల సంఖ్య 2016లో 29,890 నుంచి ఏకంగా 67,640కి పెరిగాయని మంత్రి పేర్కొన్నారు. కాగా, 2025 నాటికి 20 శాతం ఇథనాల్ కలిపిన పెట్రోల్ విక్రయించాలని కేంద్రం లక్ష్యంగా ఉన్న సంగతి తెలిసిందే. ఇది ఇప్పటికే 11.5 శాతానికి చేరడం విశేషం.

Next Story