జనవరిలో 17 శాతం పెరిగిన ప్యాసింజర్ వాహనాల విక్రయాలు!

by Disha Web Desk 13 |
జనవరిలో 17 శాతం పెరిగిన ప్యాసింజర్ వాహనాల విక్రయాలు!
X

న్యూఢిల్లీ: దేశీయ ప్యాసింజర్ వాహనాల(పీవీ) అమ్మకాలు ఈ ఏడాది జనవరిలో 17.23 శాతం పెరిగాయని వాహన తయారీదార్ల సంఘం(సియామ్‌) వెల్లడించింది. వినియోగదారుల సెంటిమెంట్ సానుకూలంగా ఉన్న నేపథ్యంలో గత నెలలో పీవీ విక్రయాలు 2,98,093 యూనిట్లకు చేరాయని సోమవారం గణాంకాల్లో సియామ్ తెలిపింది. ముఖ్యంగా పీవీ విభాగంలో యుటిలిటీ వాహనాలు(యూవీ) అత్యధిక వృద్ధిని సాధించాయి.

సియామ్ డేటా ప్రకారం.. జనవరిలో దేశవ్యాప్తంగా 1,49,328 యూవీలు విక్రయించబడ్డాయి. గతేడాది ఇదే నెలలో నమోదైన 1,16,962 యూనిట్లతో పోలిస్తే ఈసారి దాదాపు 28 శాతం ఎక్కువ కావడం గమనార్హం. అయితే, గ్రామీణ ప్రాంతాల్లో గిరాకీ మందగించడంతో ద్విచక్ర వాహనాల అమ్మకాలు కేవలం 3.81 శాతం పెరిగి 11.84 లక్షల యూనిట్లుగా నమోదయ్యాయి. పీవీ విభాగంలో భారీ వృద్ధి సాధించింది.

మొదటిసారిగా ఒక ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్-జనవరి మధ్య 10 నెలల్లో 30 లక్షల అమ్మకాల మార్కును దాటిందని సియామ్ డైరెక్టర్ రాజేష్ మీనన్ అన్నారు. ఇతర విభాగాలకు సంబంధించి త్రీ-వీలర్ అమ్మకాలు రెట్టింపు పెరిగాయి. గత నెలలో మొత్తం 55,551 పీవీ యూనిట్లు ఎగుమతి జరిగాయి. గతేడాది ఇదే నెలలో 40,781 యూనిట్లు ఎగుమతి అయ్యాయి. త్రీ-వీలర్ల 41 శాతం, ద్విచక్ర వహానల ఎగుమతులు 40.76 శాతం క్షీణించాయని సియామ్ పేర్కొంది.

Next Story