తొలిసారి 77,000 మార్కు తాకిన సెన్సెక్స్

by S Gopi |
తొలిసారి 77,000 మార్కు తాకిన సెన్సెక్స్
X

దిశ, బిజినెస్ బ్యూరో: దేశీయ ఈక్విటీ మార్కెట్లు వరుస లాభాల తర్వాత బలహీనపడ్డాయి. సోమవారం ఉదయం మెరుగ్గా ట్రేడింగ్ ప్రారంభించిన సెన్సెక్స్ చరిత్రలో తొలిసారి 77,000 మైలురాయిని చేరుకుంది. కానీ, గరిష్ఠాల వద్ద మదుపర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపడంతో నష్టాలు ఎదురయ్యాయి. అంతర్జాతీయంగా యూఎస్‌లో వడ్డీ రేట్ల తగ్గింపుపై కొనసాగుతున్న అందోళనలతో దేశీయంగా ఫైనాన్స్, ఐటీ రంగాల్లో అమ్మకాల ఒత్తిడి కనిపించింది. దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 203.28 పాయింట్లు నష్టపోయి 76,490 వద్ద, నిఫ్టీ 30.95 పాయింట్ల నష్టంతో 23,259 వద్ద ముగిశాయి. నిఫ్టీలో రియల్టీ, ఫార్మా, మీడియా రంగాలు రాణించాయి. ఐటీ రంగం నీరసించింది. సెన్సెక్స్ ఇండెక్స్‌లో ఆల్ట్రా సిమెంట్, పవర్‌గ్రిడ్, నెస్లె ఇండియా, యాక్సిస్ బ్యాంక్, ఎన్‌టీపీసీ, టాటా స్టీల్ కంపెనీల షేర్లు లాభాలను దక్కించుకున్నాయి. టెక్ మహీంద్రా, ఇన్ఫోసిస్, విప్రో, ఎంఅండ్ఎం, బజాజ్ ఫైనాన్స్, టీసీఎస్ అధిక నష్టాలను నమోదు చేశాయి. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 83.51 వద్ద ఉంది.



Next Story

Most Viewed