బడ్జెట్‌కు ముందు జరిగే 'హల్వా వేడుక' రేపే!

by Disha Web Desk 10 |
బడ్జెట్‌కు ముందు జరిగే హల్వా వేడుక రేపే!
X

న్యూఢిల్లీ: కేంద్ర బడ్జెట్‌కు ముందు ఆర్థిక శాఖ కార్యాలయంలో సాంప్రదాయంగా నిర్వహించే 'హల్వా వేడుక' గురువారం జరగనుంది. బడ్జెట్ రూపకల్పన ప్రక్రియ పూర్తయిన తర్వాత కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సమక్షంలో బడ్జెట్ తయారీలో పాల్గొన్న అధికారులు 'లాక్-ఇన్ 'లో ఉంటారు. దీనికి ముందు హల్వా వేడుకను నిర్వహించనున్నారు. గతేడాది కొవిడ్ ఒమిక్రాన్‌ వేరియంట్ ప్రభావం కారణంగా ఈ వేడుకకు బదులు స్వీట్లు పంచారు. ఈ వేడుక బడ్జెట్ రూపొందించే చివరి దశను సూచిస్తుంది. ఆర్థికశాఖ ప్రధాన కార్యాలయం బేస్‌మెంట్‌లోని ప్రింటింగ్‌ ప్రెస్‌లో బడ్జెట్‌ పత్రాల ముద్రణ జరుగుతుంది. సాధారణంగా ప్రతి ఏడాది ఈ పత్రాల ముద్రణకు ముందు భారతీయ వంటకమైన హల్వాను వండుతారు. ఆర్థిక మంత్రి, ఇతర కీలక సిబ్బంది హల్వా తయారీ క్రతువులో పాల్గొని, మంత్రిత్వ శాఖ ప్రధాన కార్యాలయంలోని అధికారులకు పంచుతారు. ఆ తర్వాత బడ్జెట్‌కు సంబంధించిన అంశాలను అత్యంత రహస్యంగా ఉంచుతూ అధికారుల 'లాక్-ఇన్' ఉంటుంది. బడ్జెట్‌ కసరత్తు మొదలవ్వగానే నార్త్‌బ్లాక్‌లోని ఆర్థిక మంత్రిత్వ శాఖ వద్దకు విలేకర్లను కూడా అనుమతించరు. ఈ అధికారులు, సిబ్బంది కేంద్ర ఆర్థిక మంత్రి బడ్జెట్‌ను ఫిబ్రవరి 1న సమర్పించిన తర్వాత మాత్రమే నార్త్‌బ్లాక్ నుంచి బయటకు వస్తారు.


Next Story

Most Viewed