బీపీసీఎల్ ప్రైవేటీకరణ లేనట్టే: కేంద్ర పెట్రోలియం మంత్రి హర్దీప్ సింగ్ పూరి

by S Gopi |
బీపీసీఎల్ ప్రైవేటీకరణ లేనట్టే: కేంద్ర పెట్రోలియం మంత్రి హర్దీప్ సింగ్ పూరి
X

దిశ, బిజినెస్ బ్యూరో: ప్రభుత్వ రంగ భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్(బీపీసీఎల్)ను ప్రైవేటీకరించే యొచన ప్రస్తుతానికి విరమించుకున్నట్టు కేంద్ర పెట్రోలియం, సహజవాయువు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి తెలిపారు. మంగళవారం ఓ జాతీయ ఛానెల్‌తో మాట్లాడిన ఆయన.. అధిక ఆదాయాన్ని ఆర్జించే ప్రభుత్వ రంగ సంస్థలను విక్రయించాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. 'బీపీసీఎల్ మొదటి 3 త్రైమాసికాల్లోనే వాటా విక్రయించే మొత్తం కంటే ఎక్కువ ఆదాయాన్ని కలిగి ఉంది. కాబట్టి ప్రైవేటీకరణ ప్రక్రియ అవసరంలేదని ' ఆయన అభిప్రాయపడ్డారు. గత ఆర్థిక సంవత్సరం ప్రథమార్థంలో బీపీసీఎల్ రూ. 19,000 కోట్ల నికర లాభాలను ఆర్జించింది. 2023-24 మూడో త్రైమాసికంలో సంస్థ లాభాలు ఏకంగా 82 శాతం వృద్ధితో రూ. 3,181.42 కోట్లకు చేరాయి. ఇక అదే త్రైమాసికంలో సంస్థ ఆదాయం రూ. 1.30 లక్షల కోట్లు కావడం గమనార్హం.

కాగా, 2021-22 ఆర్థిక సంవత్సరంలో ఎన్డీఏ ప్రభుత్వం తొలిసారిగా పెట్టుబడుల ఉపసంహరణలో భాగంగా ఎయిర్ఇండియాతో పాటు బీపీసీఎల్‌ను ప్రైవేటీకరించాలని నిర్ణయించింది. బీపీసీఎల్ భారత్‌లోనే రెండో అతిపెద్ద చమురు మార్కెటింగ్ సంస్థ. ముంబై, కొచ్చి, మధ్యప్రదేశ్‌లలో రిఫైనరీలతో రిలయన్స్, ఇండియన్ ఆయిల్ తర్వాత మూడో అతిపెద్ద రిఫైనింగ్ సామర్థ్యాన్ని కలిగి ఉంది. ప్రభుత్వం సంస్థలో 52.98 శాతం వాటాను విక్రయించాలని భావిస్తోంది. 2021-22లో వాటా విక్రయం ద్వారా రూ. 45 వేల కోట్లు వస్తాయని కేంద్రం అంచనా వేసింది. 2020, మార్చిలో ఆసక్తీ వ్యక్తీకరణ(ఈఓఐ) లేదా ప్రాథమిక్ బిడ్‌లను ఆహ్వానించింది. 2021, మార్చి కల్లా ప్రైవేటీకరణ చేయాలని ప్రణాళిక సిద్ధం చేసింది. మొదట్లో సౌదీ అరామ్‌కో, అబుదాని నేషనల్ ఆయిల్, ఎక్సాన్ మొబిల్ లాంటి గ్లోబల్ కంపెనీలు కొనుగోలుకు ఆసక్తి చూపించాయి. అయితే, ప్రస్తుతం ప్రైవేటీకరణ ప్రక్రియ పక్కకుపోయి విస్తరణ దిశగా అడుగులు వేస్తున్నట్టు సమాచారం. బీపీసీఎల్ దేశంలో ఏటా 12 మిలియన్ మెట్రిక్ టన్నుల కొత్త రిఫైనరీని ఏర్పాటు చేయాలని భావిస్తోంది. ఈ ప్రాజెక్టు కోసం రూ. 50 వేల కోట్ల పెట్టుబడి పెట్టనుంది. ఏపీ, యూపీ, గుజరాత్‌లలో దీని ఏర్పాటుకు ప్రయత్నిస్తోంది.



Next Story

Most Viewed