వరుస రికార్డు ర్యాలీతో దూసుకెళ్తున్న సూచీలు!

by Disha Web Desk 17 |
వరుస రికార్డు ర్యాలీతో దూసుకెళ్తున్న సూచీలు!
X

ముంబై: దేశీయ ఈక్విటీ మార్కెట్లలో రికార్డుల ర్యాలీ కొనసాగుతోంది. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలతో పాటు దేశీయంగా దూకుడు ర్యాలీతో సూచీలు వరుసగా ఎనిమిదో రోజు కూడా లాభాలతో సరికొత్త జీవితకాల గరిష్ఠాలకు చేరుకున్నాయి. ముఖ్యంగా అమెరికాలో డిసెంబర్ నుంచి వడ్డీ రేట్ల పెంపు వేగం తగ్గుతుందని ఫెడ్ రిజర్వ్ చైర్మన్ జెరోమ్ పవెల్ సూచించించడం, అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు తగ్గడం, భారత కరెన్సీ రూపాయి విలువ బలపడటం వంటి పరిణామాలతో స్టాక్ మార్కెట్ల ట్రేడింగ్ కొనసాగింది.

గురువారం ఉదయం ప్రారంభంలోనే కొత్త గరిష్ఠాలను తాకిన సూచీలు మిడ్-సెషన్ సమయంలో మదుపర్ల నుంచి లాభాల స్వీకరణ కారణంగా ర్యాలీ వేగం తగ్గింది. ఓ దశలో 63,500 పాయింట్లు దాటిన సెన్సెక్స్ ఇండెక్స్ చివరి గంటలో కొంత వెనక్కి తగ్గింది.

దీంతో మార్కెట్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 184.54 పాయింట్లు లాభపడి 63,284 వద్ద, నిఫ్టీ 54.15 పాయింట్లు పెరిగి 18,812 వద్ద ముగిశాయి. నిఫ్టీలో ఐటీ, మెటల్, మీడియా, పీఎస్‌యూ బ్యాంక్ రంగాలు 2 శాతానికి పైగా పుంజుకోగా, ఆటో, ఎఫ్ఎంసీజీ రంగాలు నీరసించాయి.

సెన్సెక్స్ ఇండెక్స్‌లో అల్ట్రా సిమెంట్, టాటా స్టీల్, టీసీఎస్, టెక్ మహీంద్రా, ఇన్ఫోసిస్, విప్రో, హెచ్‌సీఎల్ టెక్, ఎల్అండ్‌టీ కంపెనీ షేర్లు లాభాలను సాధించాయి. ఐసీఐసీఐ బ్యాంక్, ఎంఅండ్ఎం, పవర్‌గ్రిడ్, హిందూస్తాన్ యూనిలీవర్, కోటక్ బ్యాంక్, టైటాన్ స్టాక్స్ నష్టాలను నమోదు చేశాయి. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 81,25 వద్ద ఉంది.



Next Story

Most Viewed