జనవరిలో 14 శాతం పెరిగిన రిటైల్ వాహనాల అమ్మకాలు!

by Disha Web Desk 10 |
జనవరిలో 14 శాతం పెరిగిన రిటైల్ వాహనాల అమ్మకాలు!
X

న్యూఢిల్లీ: ప్రస్తుత ఏడాది జనవరి నెలలో భారత వాహన పరిశ్రమలో మెరుగైన అమ్మకాలు నమోదయ్యాయి. ముఖ్యంగా ప్యాసింజర్, ద్విచక్ర, ట్రాక్టర్ విభాగాల్లో విక్రయాలు గణనీయంగా పుంజుకోవడంతో గత నెలలో 14 శాతం వృద్ధి నమోదైనట్టు ఆటోమొబైల్స్ డీలర్స్ అసోసియేషన్స్(ఫాడా) సోమవారం ప్రకటనలో వెల్లడించింది. 2022, జనవరిలో మొత్తం 16.08 లక్షల యూనిట్లతో పోలిస్తే గత నెలలో మొత్తం 18.27 లక్షల యూనిట్ల విక్రయాలు జరిగాయి. ఇక, మొత్తం అమ్మకాల్లో ప్యాసింజర్ వాహనాల విభాగం 22 శాతం పెరిగి 3.40 లక్షల యూనిట్లు, ద్విచక్ర వాహనాలు 10 శాతం పెరిగి 12.65 లక్షలు, త్రీ-వీలర్ రిటైల్ అమ్మకాలు 59 శాతం పెరిగి 65,796 యూనిట్లకు పెరిగాయి. కమర్షియల్ వాహనాల విభాగంలో అమ్మకాలు 16 శాతం వృద్ధితో 70,853 యూనిట్లుగా ఉన్నాయి. ట్రాక్టర్ అమ్మకాలు గత నెలలో 8 శాతం పెరిగి 73,156 యూనిట్లకు చేరాయి. గతేడాది జనవరిలో మొత్తం 67,764 యూనిట్ల ట్రాక్టర్లు విక్రయించబడ్డాయి. సమీక్షించిన నెలలో మొత్తం రెటైల్ వాహనాల అమ్మకాలు గతేడాది కంటే ఎక్కువగా నమోదయ్యాయి. అయితే, 2020, జనవరికి ముందు కొవిడ్ సమయంతో పోలిస్తే ఇంకా 8 శాతం తక్కువగానే ఉన్నాయని ఫాడా అధ్యక్షుడు మనీష్ రాజ్ సింఘానియా అన్నారు. మెరుగైన డిమాండ్, బుకింగ్‌లు, సానుకూల సరఫరా కారణంగా అమ్మకాలు పుంజుకున్నప్పటికీ, ఎంట్రీ-లెవల్ వాహనాలపై కొంత ప్రభావం ఉందని ఆయన తెలిపారు. ఇక, ద్విచక్ర వాహనాల అమ్మకాల్లో ఇంకా ఒత్తిడి ఉందని, కానీ గతేడాది కంటే మెరుగైన అమ్మకాలు కొంత ఉత్సాహాన్నిస్తున్నాయని మనీష్ రాజ్ పేర్కొన్నారు.


Next Story