ఈ పండుగ సీజన్‌కు 35 శాతం పెరగనున్న గృహోపకరణాల అమ్మకాలు!

by Naresh N |
ఈ పండుగ సీజన్‌కు 35 శాతం పెరగనున్న గృహోపకరణాల అమ్మకాలు!
X

న్యూఢిల్లీ: ఈ ఏడాది పండుగ సీజన్‌పై అమ్మకాలు 35 శాతం పెరగనున్నాయని దేశీయ గృహోపకరణాలు, కన్స్యూమర్ డ్యూరబుల్స్ తయారీ కంపెనీలు భావిస్తున్నాయి. ప్రీమియం ఉత్పత్తుల డిమాండ్‌ కారణంగా అమ్మకాల్లో గణనీయమైన వృద్ధి కనబడుతుందని తయారీదారులు చెబుతున్నారు. ముఖ్యంగా కరోనా మహమ్మారి ప్రభావం తర్వాత వచ్చిన పండుగ సీజన్‌కు పరిశ్రమ లాభాలను చూడగలదని పానాసోనిక్, ఎల్‌జీ, సోనీ, శాంసంగ్, హైయర్, గోద్రేజ్ అప్లయన్సెస్, వోల్టాస్, థామ్సన్ సహా ఇతర కంపెనీలు తెలిపాయి. వినాయకచవితి, ఓనమ్‌తో ప్రారంభమైన పండుగ సీజన్ దసరా, దీపావళితో ముగుస్తుందని, ఈ సమయంలో ఏడాది మొత్తం విలువలో దాదాపు మూడింట ఒక వంతు అమ్మకాలు జరుగుతాయని, ఇది సుమారు రూ. 75,000 కోట్లుగా ఉంటుందని కంపెనీలు అంచనా వేశాయి.

పండుగ సీజన్‌కు తోడు కంపెనీలు గత రెండేళ్లుగా తగ్గిన అమ్మకాలను మెరుగుపరిచేందుకు మెరుగైన వారెంటీలు, సులభమైన ఈఎంఐ ప్రయోజనాలు, ఇతర రాయితీ కార్యక్రమాలతో వినియోగదారులను ఆకట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నాయి. అయితే, చిన్న పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు ఇప్పటికీ ఖర్చు విషయంలో జాగ్రత్త వహిస్తుండటంతో ఎంట్రీ-లెవల్ మాస్ మార్కెట్ అమ్మకాలపై కొంత ఆందోళన ఉందని కంపెనీలు తెలిపాయి. దీనికితోడు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వివిధ ఉత్పత్తులపై సగటున 7-8 శాతం మేర ధరలు పెరగడం కూడా అమ్మకాలపై ప్రభావితం చూపిస్తాయనే సందేహాలున్నాయని కంపెనీలు పేర్కొన్నాయి. స్మార్ట్ ఏసీలు, పెద్ద స్క్రీన్ టీవీలు, గృహోపకరణాల విభాగం అమ్మకాలు రెండంకెల స్థాయిలో ఉంటాయని ఆశిస్తున్నట్టు పానాసోనిక్ ఇండియా ఛైర్మన్ మనీష్ శర్మ అన్నారు.Next Story

Most Viewed