ఐప్యాడ్ ఉత్పత్తిని భారత్‌కు తరలించే యోచనలో యాపిల్!

by Disha Web Desk 17 |
ఐప్యాడ్ ఉత్పత్తిని భారత్‌కు తరలించే యోచనలో యాపిల్!
X

న్యూఢిల్లీ: యాపిల్ సంస్థ ఇప్పటికే భారత్‌లో తన ఐఫోన్ ఉత్పత్తిని కలిగి ఉంది. తాజాగా ఐప్యాడ్ ఉత్పత్తిలో కొంత భాగాన్ని చైనా నుంచి భారత్‌కు తీసుకురావాలని భావిస్తున్నట్టు సంబంధిత వ్యక్తులు పేర్కొన్నారు. దీనికి సంబంధించి టెక్ దిగ్గజం అధికారులతో చర్చలు కూడా ప్రారంభించిందని, ఇది విజయవంతమైతే యాపిల్ దేశీయంగా తన ఉత్పత్తిని మరింత విస్తరించనుందని సమాచారం.

ఈ ఏడాదిలో ఐఫోన్ 14 సిరీస్ తయారీ స్థానికంగా తయారైనప్పటి నుంచి డిమాండ్ గణనీయంగా పెరిగింది. దీనికితోడు చైనాలో కఠినమైన కొవిడ్ లాక్‌డౌన్ ఆంక్షలు కొనసాగుతుండటంతో గిరాకీ స్థాయిలో సరఫరా లేక యాపిల్ సమస్యలను ఎదుర్కొంటున్నది. ఈ క్రమంలోనే గ్లోబల్ కొరతను ఎదుర్కొనేందుకు, చైనాలో నెలకొన్న ప్రతికూల పరిస్థితుల మధ్య డిమాండ్‌ను తీర్చేందుకు ఐప్యాడ్ ఉత్పత్తిలో కొంత భాగం భారత్ నుంచి చేపట్టాలని కంపెనీ భావిస్తోంది. అయితే, దీనిపై అధికారికంగా ప్రకటన లేవీ రాలేదు.

ఈ ఏడాది ప్రారంభంలో యాపిల్ తన ఫ్లాగ్‌షిప్ ఐఫోన్ 14 మోడల్‌ను దక్షిణాదిలోని పెగట్రాన్ ప్లాంటులో అసెంబుల్ చేయడం ప్రారంభించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం భారత్‌లో యాపిల్ ఉత్పత్తులను ఫాక్స్‌కాన్, విస్ట్రాన్, పెగాట్రాన్ కంపెనీలు తయారు చేస్తున్నాయి. అయితే, ఐప్యాడ్ వంటి అత్యంత క్లిష్టమైన పరికరాలను తయారు చేసేందుకు నైపుణ్యం కలిగిన ఉద్యోగుల కొరత వల్ల భారత్‌లో ఈ ప్రయత్నాలు కొంత ఆలస్యంగా ప్రారంభమయ్యే అవకాశాలున్నాయని పరిశ్రమ వర్గాలు పేర్కొంటున్నాయి.


Next Story