డెలివరీల కోసం భారత్‌లో తొలి ఎయిర్ సేవలు ప్రారంభించిన అమెజాన్!

by Disha Web Desk 17 |
డెలివరీల కోసం భారత్‌లో తొలి ఎయిర్ సేవలు ప్రారంభించిన అమెజాన్!
X

హైదరాబాద్: రవాణా సౌకర్యాలను మెరుగుపరుస్తూ, వేగవంతమైన డెలివరీ సేవలందించేందుకు ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ భారత్‌లో 'అమెజాన్ ఎయిర్' సేవలను ప్రారంభించింది. దీనివల్ల దేశవ్యాప్తంగా వస్తువులను తొందరగా డెలివరీ అందించేందుకు వీలవుతుందని కంపెనీ సోమవారం ప్రకటనలో తెలిపింది.

అమెజాన్ ఎయిర్ సేవల ద్వారా ప్రధాన నగరాలైన హైదరాబాద్, బెంగళూరు, ముంబై, ఢిల్లీ నగరాలకు వస్తువులను త్వరగా డెలివరీ చేసేందుకు అమెజాన్ ఇండియా బోయింగ్ 737, బోయింగ్ 800 కార్గో విమానాలను ఉపయోగించనుంది. దీనికోసం బెంగళూరుకు చెందిన క్విక్‌జెట్ కంపెనీతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. భారత్‌లో ఈ-కామర్స్ సేవల కోసం ఓ కంపెనీ విమానసేవలను ప్రారంభించడం ఇదే తొలిసారి కావడం విశేషం.

అమెజాన్ సంస్థ ఇదివరకు 2016లో అమెరికాలో తన ఎయిర్ సేవలను ప్రారంభించింది. అనంతరం యూకేలో సేవలను విస్తరించిన తర్వాత, మూడో దేశంగా భారత్‌లో దీన్ని మొదలుపెట్టింది. అమెజాన్ ఎయిర్ సేవలను అందుబాటులోకి తీసుకురావడం ద్వారా డెలివరీ సేవలను సమర్థవంతంగా అందించగలమని, డెలివరీ నెట్‌వర్క్‌ను బలోపేతం చేసేందుకు మరిన్ని పెట్టుబడులకు సిద్ధంగా ఉన్నామని అమెజాన్‌కు చెందిన అఖిల్ చెప్పారు.


Next Story

Most Viewed