కొత్త వీడియో స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ ప్రారంభించిన ఎయిర్‌టెల్!

by Web Desk |
కొత్త వీడియో స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ ప్రారంభించిన ఎయిర్‌టెల్!
X

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ దిగ్గజ టెలికాం కంపెనీ భారతీ ఎయిర్‌టెల్ దేశీయంగా పెరుగుతున్న ఓటీటీ రంగంపై దృష్టి సారించింది. వీడియో స్ట్రీమింగ్ సేవల్లో భాగంగా సరికొత్త 'ఎయిర్‌టెల్ ఎక్స్‌ట్రీమ్ ప్రీమియం' ప్లాట్‌ఫామ్‌ను ఏర్పాటు చేసినట్టు గురువారం ఓ ప్రకటనలో వెల్లడించింది. దీని ద్వారా 15 వీడియో యాప్‌లకు చెందిన కంటెంట్‌ను కేవలం రూ. 149కే అందించనున్నట్లు తెలిపింది. దేశీయంగానే కాకుండా ఇతర దేశాలకు చెందిన మొత్తం 15 ఓటీటీలను కలిపి ఒకే యాప్ నుంచి పొందవచ్చని, ప్రస్తుతం 2 కోట్ల సబ్‌స్క్రైబర్లను సాధించాలనే లక్ష్యంతో ఉన్నట్టు ఎయిర్‌టెల్ డిజిటల్ విభాగం సీఈఓ ఆదర్శ్ నాయర్ చెప్పారు. 'ఎయిర్‌టెల్ ఎక్స్‌ట్రీమ్ ప్రీమియం' ద్వారా దాదాపు 10,000 కు పైగా సినిమాలు, ఇతర షోలు, లైవ్ ఛానెళ్లను చూడటానికి వీలుంటుంది. ఈ ప్లాట్‌ఫామ్‌లో దేశీయంగా ఆదరణ ఉన్న సోనీలివ్, లయన్స్‌గేట్ ప్లే, ఈరోస్ నౌ, హంగామా ప్లే సహా పలు ఓటీటీ వీడియో యాప్‌లు వినియోగదారులకు అందుబాటులో ఉండనున్నాయి. వీటిని మొబైల్, ల్యాప్‌టాప్, ట్యాబ్లెట్‌ల ద్వారా యాప్, వెబ్‌సైట్ల నుంచి చూడవచ్చని, ఎయిర్‌టెల్ ఎక్స్‌ట్రీమ్ సెటాప్ బాక్స్ ద్వారా టీవీలో కూడా చూసే వీలుంటుందని ఎయిర్‌టెల్ పేర్కొంది. ప్రస్తుతానికి ఈ సేవలు ఎయిర్‌టెల్ సబ్‌స్క్రైబర్లకు మాత్రమే అందుబాటులో ఉన్నాయని వివరించింది. కాగా, భారత్‌లో ఓటీటీ పరిశ్రమ అత్యంత వేగవంతంగా వృద్ధి సాధిస్తోందని, 2025 నాటికి ఓటీటీ పరిశ్రమ మార్కెట్ విలువ సుమారు రూ. 15 వేల కోట్లకు చేరుకుంటుందని పలు నివేదికలు పేర్కొన్నాయి.


Next Story

Most Viewed