లోక్‌సభ ఎన్నికల తర్వాత టారిఫ్ ధరలు పెంచనున్న ఎయిర్‌టెల్

by Dishanational1 |
లోక్‌సభ ఎన్నికల తర్వాత టారిఫ్ ధరలు పెంచనున్న ఎయిర్‌టెల్
X

దిశ, బిజినెస్ బ్యూరో: దేశీయ టెలికాం దిగ్గజం భారతీ ఎయిర్‌టెల్ లోక్‌సభ ఎన్నికల తర్వాత టారిఫ్ ధరలను పెంచాలని భావిస్తోంది. ఛార్జీల పెంపు ద్వారా వినియోదారు నుంచి వచ్చే ఆదాయం(ఆర్పు) పెంచుకోవాలని ఎయిర్‌టెల్ ప్రయత్నిస్తోంది. మరో దిగ్గజం రిలయన్స్ జియో సైతం ఇదే ఆలోచనలో ఉన్నప్పటికీ, ప్లాన్‌ల ధరలు పెంచకుండా డేటా వినియోగాన్ని పెంచే విధంగా చర్యలు తీసుకోవాలని జియో చూస్తోంది. దీనివల్ల అధిక ధరలు ఉన్న ప్లాన్‌లకు వినియోగదారులను ఆకర్షించుకోవాలని చూస్తున్నట్టు పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ప్రస్తుతం జియో కంటే ఎయిర్‌టెల్ ప్లాన్‌ల ధరలు ఎక్కువగానే ఉన్నాయి. జియో సగటు ఆర్పు స్థిరంగా ఉన్నప్పటికీ, ఎయిర్‌టెల్ క్రమంగా పెంచుకుంటూ వస్తోంది. ఐపీఎల్ సీజన్ కొనసాగుతున్న నేపథ్యంలో డేటా వినియోగం పెరిగి ప్రయోజనం పొందాలని, దానివల్ల ఆర్పు కూడా పెరుగుతుందని జియో ఆశిస్తోంది. అయితే, ఎయిర్‌టెల్ ఆర్పును పెంచుకునేందుకు రీఛార్జ్ ప్లాన్‌ల ధరల పెంపు నిర్ణయం తీసుకుంటుందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. దేశవ్యాప్తంగా ఎన్నికల హడావుడి ఉన్న కారణంగా, అవి పూర్తయిన తర్వాత ధరల పెంపు గురించి ప్రకటన ఉండొచ్చని సమాచారం. ఈ ఏడాది ద్వితీయార్థంలో జూలై-అక్టోబర్ మధ్య 15 శాతం పెంచే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం ఎయిర్‌టెల్ ఆర్పు రూ. 208 ఉండగా, జియో రూ. 182 వద్ద ఉంది. ఆర్థిక కష్టాల్లో ఉన్న వొడాఫోన్ ఐడియా ఆర్పు రూ. 145గా ఉంది.

Next Story

Most Viewed