తెల్ల జుట్టుకు రంగు, జెల్, ముఖానికి మేకప్.. ఎయిర్ ఇండియా కొత్త రూల్స్!

by Disha Web Desk 17 |
తెల్ల జుట్టుకు రంగు, జెల్, ముఖానికి మేకప్.. ఎయిర్ ఇండియా కొత్త రూల్స్!
X

న్యూఢిల్లీ: దేశీయ అతిపెద్ద సంస్థ టాటా విమానయాన ఎయిర్ ఇండియాను అధీనంలోకి తీసుకున్న తర్వాత కొత్త నిబంధనలు, నిర్ణయాలతో మెరుగైన సేవలందించేందుకు ప్రయత్నిస్తోంది. ముఖ్యంగా విమానాల్లోని సిబ్బందిని అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఉండేలా మార్చేందుకు కొత్త నిబంధనలను తీసుకొచ్చింది.

క్యాబిన్ క్రూ సిబ్బందిలో పురుషులు, మహిళల దుస్తుల్లో మార్పులు ప్రకటించింది. ఇందులో భాగంగా జుట్టు నెరిసిన వారు ఖచ్చితంగా రంగు వేసుకోవాలని, అమ్మాయిలైతే మేకప్ ఉండాలని తెలిపింది. పురుషులకు సంబంధించిన వాటిలో జుట్టుకు జెల్ వాడాలని, బట్టతల లేదంటే జుట్టు తక్కువగా ఉంటే గుండు చేయించాలని, దీన్ని ప్రతిరోజు మెయింటెయిన్ చేయాలని సూచించింది.


అలాగే, తెల్లని వెంట్రుకలుంటే రంగు వేయాలని పేర్కొంది. జుట్టు చిన్నగా ఉండాలని, చేతివేళ్లకు ఉంగరం, బ్రాస్‌లెట్ ఉండకూడదు. పెళ్లికి సంబంధించిన వాటికి మినహాయింపు ఉంటుంది. సిక్కు ఉద్యోగులు చేతికి కడియం ధరించవచ్చు. అది కూడా బంగారం లేదా వెండి తో చేసినవై లోగోలు, డిజైన్ లేకుండా 0.5 సెంటీమీటర్ల మందం మాత్రమే ఉండాలి.

మహిళలకు సంబంధించి ముత్యాల చెవిపోగులు ఉండకూడదు, డిజైన్ లేని బంగారం, డైమండ్ చెవిపోగులకు అనుమతి ఉంటుంది. ఉంగరాలు 1 సెంటీమీటర్ కంటే ఎక్కువ మందం ఉండకూడదు. అమ్మాయిలు కూడా జుట్టు నెరిస్తే రంగు వేసుకోవాలి. ఇంకా పలు నిబంధనలతో కూడా 40 పేజీల సర్క్యులర్‌ను కంపెనీ రూపొందించింది.

Next Story