ఆభరణాల వ్యాపారంలోకి అడుగుపెడుతున్న ఆదిత్య బిర్లా గ్రూప్!

by Disha Web Desk 6 |
ఆభరణాల వ్యాపారంలోకి అడుగుపెడుతున్న ఆదిత్య బిర్లా గ్రూప్!
X

న్యూఢిల్లీ: ప్రముఖ వ్యాపారవేత్త కుమార్‌ మంగళం బిర్లా నేతృత్వంలోని ఆదిత్య బిర్లా గ్రూప్ కొత్త వ్యాపారంలోకి అడుగుపెడుతోంది. దాదాపు రూ. 5,000 కోట్ల పెట్టుబడితో బ్రాండెడ్ జ్యువెలరీ రిటైల్ వ్యాపారంలోకి ప్రవేశిస్తున్నట్టు సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది. ఈ పెట్టుబడులతో ఆదిత్య బిర్లా గ్రూప్ దేశవ్యాప్తంగా పెద్ద ఫార్మాట్‌లో ప్రత్యేక రిటైల్ స్టోర్లను ఏర్పాటు చేయాలని భావిస్తోంది. 'నావల్ జ్యువెల్స్ ' అనే పేరుతో కొత్త వెంచర్ కింద తన ఆభారణాల వ్యాపారం ఉంటుందని కంపెనీ తెలిపింది. ప్రత్యేకమైన డిజైన్, అధిక నాణ్యత కలిగిన ఆభరణాల ద్వారా వినియోగదారులకు మెరుగైన సేవలందించే లక్ష్యంతో కొత్త వెంచర్ కార్యకలాపాలు ఉంటాయని పేర్కొంది. ఈ ప్రయత్నం సంస్థ వృద్ధికి దోహదపడుతుందనే నమ్మకం ఉంది.

ముఖ్యంగా దేశవ్యాప్తంగా వినియోగదారులకు చేరువ కావడానికి, సంస్థ ఉనికిని విస్తరించేందుకు అవకాశం లభిస్తుందని ఆదిత్య బిర్లా గ్రూప్ ఛైర్మన్ కుమార్ మంగళం బిర్లా అన్నారు. తమ కొత్త వెంచర్ లైఫ్‌స్టైల్ రిటైల్‌లో ఆదిత్య బిర్లా గ్రూప్ గ్రూప్ ఉద్దేశాన్ని, వినియోగదారులకు ఇచ్చే ప్రాధాన్యతను పరిగణలోకి తీసుకుని పని చేస్తుందని ఆయన తెలిపారు. ఇప్పటికే ఈ విభాగంలో ఉన్న టాటా వారి తనిష్క్, రిలయన్స్ జ్యువెల్స్‌తో నావల్ జ్యువెల్స్ పోటీ పడనుందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. ఆదిత్య బిర్లా గ్రూ ఇప్పటికే మెటల్, సిమెంట్, కెమికల్స్, టెక్స్‌టైల్స్, ఫైనాన్స్, ఫ్యాషన్ రిటైల్, రెన్యూవబుల్ ఎనర్జీ సహా పలు రంగాల్లో విస్తరించి ఉంది. పరిశ్రమ గణాంకాల ప్రకారం, దేశీయ ఆభరణాల మార్కెట్ 2025 నాటికి సుమారు రూ. 7.43 లక్షల కోట్లకు పెరుగుతుందని అంచనా. భారత రత్నాభరణాల మార్కెట్ దేశ జీడీపీలో 7 శాతం వాటా కలిగి ఉంది.



Next Story

Most Viewed