విల్మార్‌తో జాయింట్ వెంచర్‌కు అదానీ గుడ్‌బై

by Harish |
విల్మార్‌తో జాయింట్ వెంచర్‌కు అదానీ గుడ్‌బై
X

ముంబై: అదానీ విల్మార్ జాయింట్ వెంచర్ నుంచి బయటకు రావడంపై మరో మూడు నెలల్లో నిర్ణయం తీసుకుంటామని గ్రూప్ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ జుగేషిందర్ సింగ్ శుక్రవారం ప్రకటించారు. ప్రసుత్తం అదానీ విల్మార్ వాటాను ఉంచాలా లేదంటే ఉపసంహరించుకోవాలా అనే దానిపై సమీక్షిస్తున్నామని ముంబైలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన స్పష్టం చేశారు.

అదానీ విల్మార్‌లో గ్రూపునకు చెందిన మొత్తం 43.97 శాతం వాటాను ఉపసంహరించుకునేందుకు అదానీ గ్రూప్ వివిధ దిగ్గజ ఎఫ్ఎంసీజీలతో చర్చలు నిర్వహిస్తోందని ఇటీవల కథనాలు వెలువడ్డాయి. ఈ నేపథ్యంలో గ్రూప్ సీఎఫ్ఓ నుంచి ఈ ప్రకటన వెలువడటం గమనార్హం.

సింగపూర్‌కు చెందిన ‘విల్మర్ ఇంటర్నేషనల్‌’ భాగస్వామ్యంతో ఏర్పాటు చేసిన జాయింట్‌ వెంచర్‌ వంటనూనెకు సంబంధించి ఫార్చ్యూన్ బ్రాండ్‌తో ఎక్కువ ప్రసిద్ధి చెందింది. అలాగే, కంపెనీకి చెందిన ప్యాకింగ్ ఉత్పత్తులకు మెరుగైన డిమాండ్ ఉంది.

అయితే, అదానీ విల్మార్ జేవీ నుంచి బయటకు రావడం ద్వారా అదానీ గ్రూప్ తన ప్రధాన వ్యాపారమైన మౌలిక సదుపాయాల రంగంలో ఎక్కువ దృష్టి, పెట్టుబడులు పెట్టేందుకు వీలవుతుందని భావిస్తున్నట్టు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. కాగా, అదానీ విల్మార్ గత ఆర్థిక సంవత్సరం రూ. 607 కోట్ల లాభాలతో రూ. 55,262 కోట్ల ఆదాయాన్ని వెల్లడించింది.



Next Story

Most Viewed