టీడీపీ హయాంలో అభివృద్ధి అంతా గ్రాఫిక్స్‌లోనే: బుగ్గన

by  |
Buggana Rajendranath
X

దిశ ఏపీ బ్యూరో: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పేద ప్రజలకు 30 లక్షల ప్లాట్లు ఇస్తుంటే ప్రతిపక్షానికి కంటగింపుగా ఉందని ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి తెలిపారు. అమరావతిలో ఆయన మాట్లాడుతూ, ఐదేళ్లలో 30 లక్షల ప్రభుత్వ గృహాలు నిర్మించాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. కేంద్రం ఇచ్చిన నిధులతో టీడీపీ ప్రభుత్వం గత ఐదేళ్లలో 7 లక్షల ఇళ్లే ఇచ్చిందని ఆయన అన్నారు. తాము నాలుగు విడతలుగా గ్రామ సభలు పెట్టి వినతులు స్వీకరించామని మే నెల వరకు ప్రజల నుంచే 30 లక్షల దరఖాస్తులు వచ్చాయని ఆయన చెప్పారు. గృహనిర్మాణ రంగంలో 4 వేల కోట్ల బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయని అన్నారు. ఎన్నికల ముందు టీడీపీ ఆడంబరంగా శంకుస్థాపనలు చేసిందని, గ్రాఫిక్స్ ఇళ్లలోనే చంద్రబాబు శంకుస్థాపనలు చేశారని, వాటిలోనే గృహప్రవేశాలు కూడా చేయించారని బుగ్గన ఎద్దేవా చేశారు. అధిక ధరకు ప్రభుత్వం భూములు సేకరించినట్టు ఆరోపిస్తున్నారని, రాజమండ్రి వద్ద ఎకరం భూమిని 7 లక్షలకు చంద్రబాబు ఇప్పిస్తారా? అని ఆయన ప్రశ్నించారు. రాజమహేంద్రవరం చుట్టూ కాలనీలు నిర్మించాలన్నదే ప్రభుత్వ ఆలోచన అని ఆయన తెలిపారు.

Next Story

Most Viewed