కొంగొత్తగా మంత్రి కొప్పుల

by  |
కొంగొత్తగా మంత్రి కొప్పుల
X

దిశ, కరీంనగర్: టెక్నాలజీని అంది పుచ్చుకుని ఆయన ముందుకు సాగుతున్నారు.. కరోనా ప్రబలుతున్న నేపథ్యంలో బడ్జెట్ స్పెషల్ మీటింగ్ ను ప్రత్యేకంగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా చేపట్టారు. రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ధర్మపురి కౌన్సిల్ మీటింగ్ నిర్వహించారు. కరీంనగర్ లోని తన క్యాంపు కార్యాలయం నుంచి కౌన్సిల్ పాలకవర్గం, కలెక్టర్ లతో ఈ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ… ధర్మపురి పట్టణంలో పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. ప్రముఖ దేవాలయం లక్ష్మీ నారసింహ స్వామి ఆలయానికి వచ్చే భక్తుల కోసం ఆలయ పరిసర ప్రాంతాలతోపాటు గోదావరి తీరంలో ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. రూ. 35 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిందని, ఈ నిధులతో చేపట్టిన అభివృద్ది కార్యక్రమాలు త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. ధర్మపురి పట్టణాన్ని అన్నింటా అభివృద్ది చేసే దిశగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. బల్దియా యంత్రాంగం, ప్రజాప్రతినిధులు సమన్వయంతో ముందుకు సాగుతూ నిధులను సద్వినియోగం చేయాలని కోరారు. పట్టణాన్ని తీర్చిదిద్దాలన్న సంకల్పంతో బడ్జెట్ తక్కువగా ఉన్నా రాష్ట్ర ప్రభుత్వం నిధులు కేటాయించిందనే విషయం గుర్తు పెట్టుకోవాలన్నారు.

Next Story

Most Viewed