74 ఏళ్ల తర్వాత తొలిసారి కలుసుకున్న అన్నదమ్ములు.. వైరల్

208

ఛండీగర్ : రెండు వందల ఏళ్ల బ్రిటీష్ రూలింగ్ తర్వాత భారతదేశానికి 1947 ఆగస్టు 14న అర్ధరాత్రి స్వాతంత్ర్యం లభించిన విషయం తెలిసిందే. అంతకంటే ముందు ఇండియా, పాకిస్తాన్‌ల మధ్య విభజన జరిగిన సమయంలో చాలా కుటుంబాలు సరిహద్దుల వద్ద విడిపోయాయి. కొందరు పాకిస్తాన్‌లో స్థిరపడితే మరికొందరు ఇండియాలో స్థిరపడ్డారు. ముఖ్యంగా పాకిస్తాన్‌తో సరిహద్దు పంచుకుంటున్న చాలా రాష్ట్రాల్లో ఇలాంటి పరిస్థితులు కనిపిస్తాయి. ప్రస్తుత పంజాబ్ రాష్ట్రంలో కొంత భాగం పాక్‌లో ఉంటే మరికొంత ఇండియాలో ఉంది.

దీంతో ఒకే కుటుంబానికి చెందిన కొందరు వ్యక్తులు భూములు, ఆస్తులను వదిలి రాలేక పాక్‌లో స్థిరపడిపోగా.. మరికొందరు ప్రాణాలను అరచేతిలో పట్టుకుని ఇండియాకు చేరుకున్నారు. కారణం ముస్లిం జనాభా ప్రతిపాదికన ఆనాడు పాకిస్తాన్ ఏర్పాటైంది. దీంతో హిందువులు, సిక్కులు, ఇతర మతస్తులను నాటి జిన్నా ప్రభుత్వం ఊచకోత కోసింది. దీంతో చాలా మంది హిందూవులు, సిక్కులు ప్రాణభయంతో బోర్డర్ క్రాస్ చేశారు. కొందరు మాత్రం ధైర్యం చేసి పాక్‌లోనే ఉండిపోయారు. అయితే, గతేడాది భారత్, పాక్ దేశాల మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం ‘కర్తార్ పూర్ కారిడార్‌’ను డెవలప్ చేసే ప్రక్రియను దాయాది దేశం చేపట్టింది.

ఈ కారిడార్ వలన భారత్‌లోని సిక్కులు ఎటువంటి భయం లేకుండా పాక్‌లోని కర్తార్ పూర్‌లో గల తమ మతగురువు మందిరాన్ని దర్శించుకునేందుకు ఇరు దేశాల ప్రభుత్వాలు అంగీకారం తెలిపాయి. దీనికి సంబంధించి వేగంగా అడుగులు పడటంతో విభజన సమయంలో విడిపోయిన ఇద్దరు అన్నదమ్ములు 74 ఏళ్ల తర్వాత తొలిసారి కలుసుకున్నారు. దీంతో ఇరువురు ఒకరినొకరు ఆలింగనం చేసుకుని కన్నీటిపర్యంతం అయ్యారు. చిన్నతనంలో వీడిపోయిన సోదరులు వృద్ధాప్యంలో కలుసుకోవడంతో ఆ దృశ్యం అందరినీ కలిచివేసింది. దీనికి సంబంధించిన వీడియోను సోనియా సింగ్ అనే మహిళ తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేస్తూ.. నా హృదయం.. 1947లో విభజన అనంతరం 74 ఏళ్ల తర్వాత ఇద్దరు సోదరులు మొదటిసారి కలుసుకున్నారు’ అనే శీర్షికతో షేర్ చేశారు. గంటల వ్యవధిలోనే ఈ ట్వీట్ తెగ వైరల్ అయ్యింది. నాటి విభజన చాలా కుటుంబాలను వేరు చేయడమే కాకుండా పెద్ద ఎత్తున హింసకు కారణమైందంటూ పలువురు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.