నిన్నటిదాకా బండి హీరో.. ఇకపైన.?

by  |
నిన్నటిదాకా బండి హీరో.. ఇకపైన.?
X

దిశ, తెలంగాణ బ్యూరో: ప్రధాని మోదీతో ముఖ్యమంత్రి కేసీఆర్ భేటీ కావడంతో రాష్ట్రంలో ఒక్కసారిగా రాజకీయాలు మారిపోయాయి. దుబ్బాక అసెంబ్లీ ఉప ఎన్నిక, జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాలతో హీరోగా మారిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ భవిష్యత్తు ఇకపైన ఎలా ఉంటుందనే చర్చ మొదలైంది. కేసీఆర్ ఢిల్లీ పర్యటనలో ప్రధానితో భేటీ కావడం ప్రస్తుతానికి టీఆర్ఎస్ నుంచి బీజేపీలోకి జరిగే వలసలకు బ్రేక్ పడినట్లయింది. ఇప్పటిదాకా దూకుడు ప్రదర్శించిన బీజేపీ ఇకపైన ఎలాంటి వైఖరి అవలంబిస్తుందన్నది ఆసక్తికరంగా మారింది.

రానున్న ఎన్నికల్లో బీజేపీదే అధికారం, ఇక టీఆర్ఎస్ పతనం మొదలైంది, కేసీఆర్ కుటుంబం జైలుకు వెళ్లక తప్పదు, ఆరేళ్ల అవినీతిని బయటకు తీస్తాం, ఈ ప్రభుత్వం పూర్తికాలం ఉండడం కష్టమే, మధ్యంతర ఎన్నికలు తప్పవు.. లాంటి ఘాటైన డైలాగులు వల్లించిన బండి సంజయ్ పాత్ర ఇకపైన ఎలా ఉండబోతుందనే చర్చలు ఆ పార్టీలోనే మొదలయ్యాయి. టీఆర్ఎస్‌లో అసంతృప్తితో ఉన్న నేతలు తమ పార్టీలోకి రాక తప్పదని, ఇప్పటికే సుమారు 30 మంది టచ్‌లో ఉన్నారని బీజేపీ నేతలు ఇంతకాలం వ్యాఖ్యానించారు. ఇప్పుడు కేసీఆర్, ప్రధాని ఏకాంత చర్చలతో టీఆర్ఎస్, బీజేపీ దగ్గరయ్యాయన్న సంకేతం తెలంగాణ సమాజానికి చేరింది. టీఆర్ఎస్ నుంచి బీజేపీలోకి వెళ్ళిపోదామనుకున్న వారి గొంతులో వెలక్కాయ పడినట్లయింది. రెండూ ఒకటే అయినప్పుడు ఇక వెళ్ళడం ఎందుకనే చర్చలు మొదలయ్యాయి. ఇప్పుడు ఈ రెండు పార్టీల దృష్టి కాంగ్రెస్‌లో మిగిలినపోయిన నేతలను లాగి ఆ పార్టీని మరింత నిర్వీర్యం చేయడంపైనే ఉండబోతుంది కాబోలు! అసలే నాయకత్వ సమస్యతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న కాంగ్రెస్‌కు ఇక గడ్డు కాలమే.

నిన్నటి డైలాగులు.. నేటి పరిస్థితి

దుబ్బాకలో గెలిచిన తర్వాత అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీస్తాం అని ఎమ్మెల్యే రఘునందన్ రావు వ్యాఖ్యానించారు. జీహెచ్ఎంసీలో ప్రభుత్వానికి చెమటలు పట్టిస్తాం అని బండి సంజయ్ వ్యాఖ్యానించారు. టీఆర్ఎస్‌ను ఢీకొనే సత్తా ఒక్క బీజేపీకే ఉందని విజయశాంతి అన్నారు. ఈ పెద్ద నేతలంతా ఇకపైన ఏం చేయనున్నారనేది ఆసక్తకరంగా మారింది. ఇప్పటిదాకా వారీ డైలాగులే వేసినా తాజా రాజకీయ పరిణామాలతో వారి ఆచరణ ఎలా ఉండబోతుందన్నదే కీలకంగా మారింది. నాగార్జునసాగర్ ఉప ఎన్నిక, ఖమ్మం, వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు, దాని వెన్నంటి వచ్చే ఎమ్మెల్సీ (పట్టభద్రుల) ఎన్నికల్లో టీఆర్ఎస్‌ను ఓడిస్తామని గంభీర ప్రకటనలు చేసిన బీజేపీ ఎలాంటి వైఖరి తీసుకుంటుందనేది గమనార్హం. ఈ రెండు పార్టీల మధ్య మ్యాచ్ ఫిక్సింగ్ ఉందంటూ రేవంత్ రెడ్డి సహా చాలా మంది కాంగ్రెస్ నేతలు వ్యాఖ్యానించారు. ఇవి సహజంగా చేసే రాజకీయ విమర్శలే అని చాలా మంది పెద్దగా పట్టించుకోలేదు. కానీ ఢిల్లీలో కేసీఆర్-ప్రధాని తాజా భేటీతో ఆ వ్యాఖ్యలు నిజమేనని ప్రజలు ఇప్పుడు అభిప్రాయపడుతున్నారు. టీఆర్ఎస్‌పైన ఇటీవలి కాలంలో ఏర్పడిన వ్యతిరేకత, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో వరద సాయంపై తలెత్తిన అసంతృప్తి బీజేపీకి లబ్ధి చేకూర్చింది. టీఆర్ఎస్‌కు ప్రత్యామ్నాయం బీజేపీయే అనే అభిప్రాయం ప్రజల్లో ఏర్పడింది. తెలంగాణను ఇచ్చింది కాంగ్రెస్సే అని ఆ పార్టీ నేతలు ఎంతగా చెప్పుకున్నా నాయకత్వంపై ప్రజలకు ఏర్పడిన అసహ్యం చివరకు బీజేపీకి వరంగా మారింది. కానీ ఇప్పుడు టీఆర్ఎస్, బీజేపీ ఒకటే అనేది కొత్త పరిణామం.

ఒకే తాను ముక్కలు

ఎలాగూ టీఆర్ఎస్, మజ్లిస్ ఒకటే అనే ముద్రకు అదనంగా ఇప్పుడు బీజేపీ కూడా అదే తానులో ముక్క అనే చర్చలు ప్రజల్లోనే వ్యక్తమవుతున్నాయి. ప్రజలు ఇకపైన ఎలా ఆలోచిస్తారు, టీఆర్ఎస్‌పైన ఉన్న అసంతృతప్తి ఇకపైన ఏ టర్న్ తీసుకుంటుంది, సమర్ధవంతమైన నాయకత్వలేమితో సతమతమవుతున్న కాంగ్రెస్‌కు ఇంకా తెలంగాణ భూమిపైన నూకలు ఉన్నాయా, ప్రజల అసంతృప్తికి నిజమైన ప్రత్యామ్నాయ పార్టీ ఏది.. ఇవన్నీ ఇకపైన తెరమీదకు వచ్చే అంశాలు. ఇప్పటిదాకా దూకుడు ప్రదర్శించిన బీజేపీ వ్యూహం ఇకపైన ఎలా ఉండబోతుంది? టీఆర్ఎస్‌ను, దానికి అనుబంధంగా ఉన్న మజ్లిస్‌ను ప్రధాన ప్రత్యర్థిగా చెప్పుకున్న బీజేపీ ఇకపైన ఎలా వ్యవహరించబోతుంది? వీటికి కాలమే సమాధానం చెప్పాలి.


Next Story

Most Viewed