అక్టోబర్‌లో బ్రహ్మకమలం.. కారణం క్లైమేట్ ఛేంజ్?

by  |
అక్టోబర్‌లో బ్రహ్మకమలం.. కారణం క్లైమేట్ ఛేంజ్?
X

దిశ, వెబ్‌డెస్క్: సాసురియా ఒబ్వాల్లటా అని శాస్త్రీయంగా పిలిచే బ్రహ్మకమలం.. ఏడాదికి ఒక్కసారి మాత్రమే వికసిస్తుంది. హిందూ పురాణాల్లో ఈ పువ్వుకు ప్రత్యేకమైన స్థానం ఉంది. ‘కేదారనాథ్, బద్రీనాథ్, తుంగనాథ్’ వంటి పవిత్ర దేవాలయాల్లో ఈ పువ్వుతో పూజలు చేస్తుంటారు. హిమాలయాల వంటి ఎత్తైన ప్రదేశాల్లో ప్రతి ఏడాది ఆగస్టు నుంచి సెప్టెంబర్ మధ్యలో ఈ పువ్వు వికసిస్తుంది. కానీ ప్రస్తుతం అక్టోబర్ నెల గడుస్తున్నప్పటికీ ఈ పువ్వులు ఇంకా పూస్తూనే ఉన్నాయి. ఉత్తరాఖండ్‌లోని చమోలీ జిల్లాలో ఈ బ్రహ్మకమలాలు పూస్తున్నాయి. ఇక్కడ మాత్రమే కాకుండా రుద్రప్రయాగ్, నందికుండ్ ప్రాంతాల్లోనూ పెద్ద సంఖ్యలో ఈ పువ్వులు పూస్తున్నాయి.

ఈ విషయం గురించి నిపుణులను అడిగితే ఈ ఏడాది టూరిస్టులు తక్కువగా రావడంతో పాటు వాతావరణంలో వచ్చిన మార్పు కూడా కారణమని చెబుతున్నారు. సముద్రమట్టానికి 3500 నుంచి 3800 మీటర్ల ఎత్తులో పూసే ఈ పూలు, ఇలా సీజన్ కాని సీజన్‌లో పూయడం ఓ రకంగా మంచి పరిణామమేనని వారు అంటున్నారు. ఎక్కువగా మనుషులు రాకపోవడం, ఎవరూ బ్రహ్మకమలాలను తుంచకపోవడం వలన ఈ ఏడాది బ్రహ్మకమలాల దిగుబడి కూడా బాగుంటుందని కేదార్‌నాథ్ ఫారెస్ట్ ఆఫీసర్ అమిత్ కాన్వర్ అంటున్నారు. దిగుబడి ఎక్కువగా ఉంటే కాలేయ వ్యాధుల మూలికలు తయారు చేయడానికి వీటిని ఎక్కువగా సరఫరా చేయవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు.



Next Story