హెచ్‌ఓడీ కేంద్రంగా బూర్గుల భవన్ ?

by  |
హెచ్‌ఓడీ కేంద్రంగా బూర్గుల భవన్ ?
X

దిశ, న్యూస్‌బ్యూరో: సచివాలయం కూల్చివేత పనులు దాదాపు పూర్తికావస్తున్నందున కొత్త సచివాలయ నిర్మాణాన్ని వీలైనంత త్వరగా పూర్తిచేసి వేర్వేరు ప్రాంతాల్లో ఉన్న వివిధ శాఖల, విభాగాల (హెచ్ఓడి) కార్యాలయాలన్నింటినీ బూర్గుల రామకృష్ణారావు భవన్‌లోకి షిప్టు చేసే విధంగా ముసాయిదా ప్రణాళిక తయారవుతోంది. ప్రస్తుతం తాత్కాలిక సచివాలయంగా ఈ భవనం కొనసాగుతున్నందున కొత్త సచివాలయం నిర్మాణం పూర్తయ్యి వినియోగంలోకి వస్తే బూర్గుల భవన్‌ను ఆ అవసరాలకు వాడుకోవాలన్నది ప్రభుత్వ ఆలోచన. సంక్షేమ భవన్, హాకా భవన్, పరిశ్రమ భవన్, అరణ్య భవన్, ఆబ్కారీ భవన్.. ఇలా వివిధ శాఖల, విభాగాల ఆఫీసులన్నింటినీ బూర్గుల భవన్‌లోకి మార్చాలన్నది ప్రభుత్వ ఆలోచన.

కొత్త సచివాలయం ఎలా ఉండాలన్నదానిపై ముఖ్యమంత్రి రెండు రోజుల క్రితం ప్రగతి భవన్‌లో మంత్రులు, అధికారులతో సమీక్ష జరిపిన సందర్భంగా ఈ ప్రతిపాదన చర్చకు వచ్చినట్లు తెలిసింది. ముఖ్యమంత్రి, మంత్రులు సహా ఆయా శాఖల కార్యదర్శులంతా కొత్త సచివాలయంలోనే ఉండేలాగ, సమావేశాలను నిర్వహించుకునేలాగ డిజైన్ చేస్తున్నట్లు చెప్పిన సీఎం దీనికి సమీపంలోనే హెచ్ఓడీ కార్యాలయాలు కూడా ఉంటాయని స్పష్టం చేశారు. అయితే అలాంటి అవసరాలకు కొత్త సచివాలయం డిజైన్‌లో చోటు లేనందువల్ల సమీపంలో ఉన్న బూర్గుల భవన్‌‌ను ఆ అవసరాలకు వాడుకోవాలని సూచించినట్లు తెలిసింది.

పది అంతస్తులతో సుమారు 1.60 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న బూర్గుల రామకృష్ణారావు భవన్‌లో అన్ని శాఖల పరిధిలోని హెచ్ఓడీ ఆఫీసులను సర్దుబాటు చేయవచ్చన్నది అధికారుల అంచనా. మొత్తం ఎన్ని విభాగాలు ఉన్నాయి, అందులో ఎంత మంది రెగ్యులర్ ఉద్యోగులు ఉన్నారు, ఎంత మంది కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ విధానంలో పనిచేస్తున్నారు లాంటి వివరాలన్నీ ఇప్పటికే ఆర్థిక మంత్రిత్వశాఖ దగ్గర సిద్ధంగా ఉన్నాయి. దాని ఆధారంగా బూర్గుల భవన్‌లో వీటిని ఏ రకంగా సర్దుబాటు చేయవచ్చు, పెద్ద హెచ్ఓడీలను, రాష్ట్ర ప్రభుత్వరంగ సంస్థలను యధావిధిగా ఇప్పుడున్న భవనాల్లోంచే పనిచేయడానికి ఉన్న అవకాశాలు తదితరాలన్నింటినీపై ఇకపైన పూర్తిస్థాయి కసరత్తు జరుగుతుంది.

ఉమ్మడి రాష్ట్రంలో ఏర్పడిన సచివాలయాన్ని ఖాళీ చేసిన తర్వాత చాలా శాఖలు, విభాగాలు చెట్టుకొకటి, పుట్టకొకటిగా మారిపోయాయి. పరిపాలనా సౌలభ్యం కోసమే నూతన సచివాలయాన్ని నిర్మిస్తున్నట్లు ప్రభుత్వం చెప్పుకుంటున్నందున హెచ్ఓడీలను సైతం వేర్వేరు ప్రాంతాల నుంచి సచివాలయం సమీపంలోకి ఒకే భవనంలో పనిచేసేలా మార్చడం ప్రయోజనకరంగా ఉంటుందని ముఖ్యమంత్రే స్వయంగా చెప్పారు. ఈ నేపథ్యంలో సాధారణ పరిపాలనా శాఖ సహకారంతో ప్రధాన కార్యదర్శి ఈ దిశగా ఆలోచిస్తూ ముసాయిదా ప్రణాళికను సిద్ధం చేసే పనిలో ఉన్నట్లు తెలిసింది.

ఎలాగూ తాత్కాలిక సచివాలయంగా మారిన తర్వాత ఉన్నతాధికారుల అవసరాల కోసం ప్రత్యేకంగా ఛాంబర్లు, క్యాబిన్‌లు, వర్క్ స్టేషన్లు తయారయ్యాయి. వీటిని యథాతధగా ఆయా విభాగాల అవసరాలను బట్టి వినియోగించుకోవచ్చన్న అభిప్రాయాన్నీ జీఏడీ అధికారులు వ్యక్తం చేశారు. అయితే కొత్త సచివాలయానికీ, బూర్గుల భవన్‌కూ మధ్య రాకపోకల విషయంలో సాధారణ ట్రాఫిక్‌కు ఇబ్బంది లేని తీరులో ప్రత్యేక ఏర్పాట్లు జరిగే అవకాశం ఉంది.

Next Story

Most Viewed