బెస్ట్ ఫ్రెండ్స్.. పావురంతో 80ఏళ్ల వృద్ధుడి ‘ఫ్రెండ్‌షిప్’

by  |
pigeon and Xavier
X

దిశ, ఫీచర్స్ : మనిషికి, జీవజాతుల మధ్య ‘స్నేహం’ ఇప్పటిది కాదు. భూమి ఆవిర్భ కాలం నుంచే దోస్తీకి సయోద్య కుదిరింది. శునకం, పిల్లులు, కోళ్లు, గుర్రాలు, మేకలు మాత్రమే కాదు మనిషితో మచ్చిక పెంచుకున్న పక్షులతోపాటు.. పులులు, సింహాల వంటి క్రూర మృగాలు కూడా మనిషితో మిత్రబంధం కొనసాగించాయి. రహస్య సమాచారాన్ని తీసుకొచ్చే డేగల నుంచి ప్రేమ సందేశాలు మోసుకెచ్చే పావురాల వరకు మ్యాన్-యానిమల్స్ బంధం అపూర్వమైంది, అద్వితీయమైంది. ఈ క్రమంలోనే ఫ్రాన్స్‌కు చెందిన 80ఏళ్ల వృద్ధుడికి, ఓ చిట్టి పావురానికి మధ్య కొనసాగుతున్న స్నేహబంధం ఫ్రాన్స్ వాసులను ఆకట్టుకుంటోంది.

ఫ్రాన్స్‌లోని బ్రిటనీ ప్రాంతానికి చెందిన జేవియర్ బౌగెట్ ఉద్యోగం నుంచి రిటైర్ కావడంతో సంతోషంగా తన సెకండ్ చైల్డ్‌హుడ్‌ను అనుభవిస్తున్నాడు. ఒకానొక రోజు బౌగెట్ తన ఇంటికి సమీపంలో నడుచుకుంటూ వస్తుండగా ఎగరలేక నేలమీద కొట్టుమిట్టాడుతున్న ఓ బుజ్జి పావురాన్ని చూశాడు. అంతలోనే ఓ పిల్లి దాన్ని పట్టుకోవడానికి ప్రయత్నిస్తుంది. కానీ బౌగెట్ మాత్రం ఆ పక్షిని అలానే వదిలేసి వెళ్లిపోయాడు. కాస్త సమయం తర్వాత రియలైజ్ కావడంతో మళ్లీ తిరిగొచ్చి దాన్ని పట్టుకుని ఇంటికి తీసుకెళ్లాడు. ఇక ఆ నాటి నుంచి ‘బ్లాంచొన్’ (పావురం పేరు)తనతోనే జీవిస్తుంది.

బౌగెట్ సైకిల్ రైడ్‌‌కు వెళితే.. అతడి టోపి మీద కూర్చుని ప్రపంచాన్ని చూస్తుంది. తోటపని చేస్తుంటే, భుజం మీద వాలి అతడు చేసే పనిని గమనిస్తుంది. ముక్కు మీదకు చేరి ముద్దుగా పెదాలను మీటుతుంది. సాయంత్రపు నడకలో బౌగెట్‌ పక్కన నడుస్తూ కంపెనీ ఇస్తుంది. ఆ బుజ్జి పావురం ఎదుగులతో పాటు, వారి స్నేహం కూడా మరింత ప్రేమమయమైంది.

‘పక్షిని మచ్చిక చేసుకోవటానికి ఎలాంటి శిక్షణ ఇచ్చావంటూ అందరూ నన్ను తరుచుగా అడుగుతుంటారు. దానికి ట్రిక్ ఏం లేదు. కేవలం పరస్పర గౌరవం మాత్రమే. ప్రకృతిలో మానవులతో పాటు, జీవజాతులకు కూడా స్థానముంది. అందుకే ఏ మానవుడైనా ఒక జంతువుతో సంబంధాన్ని పెంచుకోగలడు. జంతువులు కూడా మానవుని స్నేహం, ప్రేమను కోరుకుంటాయి. అయితే వాటి జీవన విధానాన్ని అర్థం చేసుకోవాలి. ఓపికగా ఉంటూ, వాటికి ప్రేమను పంచాలి. మనం ఎంత అభిమానాన్ని అందిస్తే, తిరిగి అంతకు రెట్టింపు ప్రేమను అవి మనకు పంచుతాయి’ అని బౌగెట్ తెలిపాడు.

Next Story