తెలంగాణను ఇస్లాం, ఏపీని క్రైస్తవ రాజ్యం చేయాలనుకుంటున్నారు !

by  |
Bandi Sanjay, Pawan Kalyan
X

దిశ, న్యూస్‌బ్యూరో: పోతిరెడ్డిపాడు విషయంలో రెండు తెలుగు రాష్ట్రాలు కలిసి పన్నాగం పన్నుతున్నాయని తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. నీటి వాటాల విషయంలో స్పష్టమైన నిబంధనలు ఉన్నాయని, ఆ ప్రకారమే ఇటు తెలంగాణ, అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు వ్యవహరించాలని అన్నారు. పోతిరెడ్డిపాడు కాలువను విస్తరించడం, కొత్త లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును నిర్మించి మరింత ఎక్కువ స్థాయిలో కృష్ణా జలాలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకెళ్ళే ప్రతిపాదన గురించి ఇప్పటికే గవర్నర్‌కు, కేంద్ర జలశక్తి మంత్రిత్వశాఖకు వివరించామని అన్నారు. పోతిరెడ్డిపాడు విషయంలో తెలంగాణ ప్రజలు తోటి తెలుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ ప్రజలకు వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు. తెలంగాణను ఇస్లాం రాజ్యంగా, ఆంద్రప్రదేశ్‌ను క్రైస్తవ రాజ్యంగా చేయాలని రెండు రాష్ట్రాల సీఎంలు భావిస్తున్నారని ఆరోపించారు. అయోధ్యను రక్షించుకున్నట్లుగానే తిరుమల తిరుపతి దేవస్థానాన్ని కూడా రక్షించుకుంటామన్నారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్‌తో మర్యాదపూర్వక భేటీ అనంతరం సోమవారం బండి సంజయ్ ఈ వ్యాఖ్యలు చేశారు.

రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ అధికార పార్టీలు రాజకీయ ప్రయోజనాల కోసం విద్వేషాలను రెచ్చగొడుతున్నాయని బండి సంజయ్ ఆరోపించారు. రాష్ట్రాలుగా విడిపోయినా తెలుగు ప్రజలు కలిసిమెలిసి ఉంటున్నారని, కానీ రాజకీయ ప్రయోజనాల కోసం రెండు పార్టీల నేతలు కొంత గందరగోళాన్ని సృష్టిస్తున్నారన్నారు. పవన్ కల్యాణ్‌తో భేటీ గురించి ప్రస్తావిస్తూ, ఇది మర్యాదపూర్వకమైనదేనని అన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీతో కలిసి పనిచేయాలని నిర్ణయం తీసుకున్న పవన్ కల్యాణ్ తెలంగాణ విషయంలోనూ అలాంటి సహకారాన్ని ఇవ్వడానికి సుముఖత వ్యక్తం చేశారని, ఈ భేటీలో చర్చించామని వివరించారు. తిరుమల తిరుపతి దేవస్థానం విషయంపై పవన్ కల్యాణ్‌తో చర్చ జరగకపోయినప్పటికీ స్థిరాస్తులను అమ్ముకోవాలని బోర్డు నిర్ణయం తీసుకోవడం దురదృష్టకరమన్నారు. తెలంగాణ ఇస్లాం రాజ్యంగా మార్చాలని కేసీఆర్, ఏపీని క్రైస్తవ రాజ్యాంగా మార్చాలని జగన్ ప్రయత్నిస్తున్నారని, అయితే వారి ఆటలు సాగవన్నారు. అయోధ్య రామమందిరాన్ని రక్షించుకున్నట్లే తిరుపతిని కూడా కాపాడుకుంటామని, బీజేపీ కార్యకర్తలు తలుచుకుంటే తిరుమలను కాపాడుకోవటం పెద్ద కష్టం కాదన్నారు. ఇతర మతాల ప్రార్థన మందిరాల జోలికి వెళ్ళే దమ్ము జగన్‌కు ఉందా అని ప్రశ్నించారు. హిందూవులు గర్జిస్తే కేసీఆర్, జగన్‌లు పారిపోతారన్నారు. తిరుమలను కాపాడుకోవటానికి జెండాలు పక్కన పెట్టి హిందూవులు ముందుకురావాలన్నారు. తిరుమల ఆస్తులను కాపాడటానికి మాత్రమే కమిటీలు వేయాలి తప్ప అమ్మటానికి కాదన్నారు.

Next Story

Most Viewed