టార్గెట్ సీఎం.. బీజేపీ వ్యూహంలో కేసీఆర్ చిక్కేనా..?

155
BJP KCR

దిశ, తెలంగాణ బ్యూరో : తెలంగాణలో అధికారమే టార్గెట్‌గా బీజేపీ పావులు కదుపుతోంది. రాష్ట్ర ప్రభుత్వ పాలనలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న వర్గాలపైనే కాషాయ నేతలు దృష్టి సారిస్తున్నారు. తెలంగాణ సర్కార్​కారణంగా ఏఏ వర్గాల ప్రజలు తీవ్రంగా నష్టపోయారో వారిని గుర్తించి తమకు మద్దతుదారులుగా మార్చుకునేందుకు బీజేపీ శ్రేణులు ప్రణాళికలు రూపొందిస్తోంది. అందులో భాగంగా దళిత, గిరిజన నియోజకవర్గాలపై ఫోకస్​పెట్టింది. రాష్ట్రంలో 19 అసెంబ్లీ స్థానాలు ఎస్సీ రిజర్వ్‌డ్​ఉండగా.., 12 అసెంబ్లీ స్థానాలు ఎస్టీ రిజర్వ్‌డ్‌గా ఉన్నాయి. మొత్తంగా 31 స్థానాలపై బీజేపీ రాష్ట్ర అధిష్టానం ఫోకస్​పెట్టింది. దీనికోసం సీనియర్​నాయకులతో ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయాలనే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే ఈ 31 నియోజకవర్గాల్లో దాదాపు 40 అంశాలపై సర్వే నిర్వహించనున్నట్లు విశ్వసనీయ సమాచారం.

తెలంగాణలో టీఆర్ఎస్​ప్రభుత్వం ప్రజలకు ఇస్తామని నెవరేవర్చని హామీలనే ఇందుకు అస్త్రంగా మార్చుకుంది. దళితులను సీఎం చేస్తానని చేయకుండా మోసం చేయడం, మూడెకరాల భూమి ఇస్తామని ఇవ్వకుండా కాలం వెళ్లదీయడం, డబుల్​బెడ్రూం ఇండ్లు, దళిత బంధు కింద రూ.10 లక్షలు వంటివి ఏవీ నెరవేరలేదు. దీంతో దళిత వర్గాల్లో ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత ఏర్పడింది. దీన్నే బీజేపీ అధిష్టానం క్యాష్​చేసుకోవాలని చూస్తోంది. అలాగే గిరిజనులకు ఇవ్వాల్సిన 10 శాతం రిజర్వేవన్లపై సైతం హామీలిచ్చి రాష్ట్ర ప్రభుత్వం మరిచిపోయింది. తండాలను గ్రామపంచాయతీలుగా చేసి అభివృద్ధికి నిధులు మంజూరు చేయకపోవడం వంటి అంశాలు టీఆర్ఎస్‌కు తలనొప్పిగా మారాయి. టీఆర్ఎస్​హయాంలో దళిత, గిరిజన వర్గాల ప్రజలపై అణిచివేత సైతం ఎక్కువ కావడంతో తీవ్ర వ్యతిరేకత ఎదురవుతోంది. దీనినే ఎత్తిచూపుతూ ప్రజలకు దగ్గరయ్యేందుకు బీజేపీ రాష్ట్ర అధిష్టానం ఫోకస్​పెట్టింది.

రాష్ట్రంలోని 31 ఎస్సీ, ఎస్టీ రిజర్వ్‌డ్​స్థానాల్లో ఏ అభ్యర్థిని బరిలోకి దింపాలి? ఎవరికి ప్రజల్లో మద్దతు ఎక్కువగా ఉంది అనే అంశాలపై బీజేపీ రాష్ట్ర అధిష్టానం ఇప్పటి నుంచే ఫోకస్​చేస్తోంది. దీనికిగాను కొందరు అబ్జర్వర్లను బీజేపీ నియమించనుంది. ఆయా నియోజకవర్గాల్లో ఎంతమంది ఆశావహులు ఉన్నారు. పబ్లిక్‌లో ఎవరికి బాగా జనాదరణ ఉంది అనే అంశాలను పరిగణలోకి తీసుకొని అబ్జర్వర్లు సర్వేను నిర్వహించనున్నారు. ఇందులో ప్రజలకు ఎలాంటి పథకాలు అవసరం, ఏ రూట్లో వెళ్తే ప్రజలు బీజేపీకి మద్దతుగా నిలబడుతారు వంటి దాదాపు 40 అంశాలపై ఈ సర్వే ఉండనున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఈ సర్వేలో వివరాలను అబ్జర్వర్లు సీనియర్​నేతలతో కూడిన కమిటీకి నివేదికను అందజేస్తారు. దాని ఆధారంగానే వచ్చే ఎన్నికల్లో ఏ నాయకుడిని నిలబెడితే బాగుంటుంది. ఏ ప్రణాళికతో పబ్లిక్​లోకి వెళ్తే ఆదరణ లభిస్తుందనే అంశాలపై ప్రత్యేక రిపోర్ట్ సిద్ధం చేసుకుని ఎన్నికల బరిలోకి దిగేందుకు బీజేపీ సిద్ధమవుతోంది.

బండిపై జరిగిన దాడిపై విచారణ ప్రారంభం

మరోవైపు కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్‌పై స్థానిక పోలీస్ కమిషనర్ అకారణంగా దాడి చేశారన్న ఫిర్యాదుపై పార్లమెంటరీ ప్రివిల్లేజ్ కమిటీ విచారణ ప్రారంభించింది. ఈ నెల 3వ తేదీన బండి సంజయ్​పార్లమెంటరీ కార్యాలయంలో పోలీసులు చేసిన దాడి గురించి వ్యక్తిగతంగా స్టేట్​మెంట్​ఇచ్చేందుకు పిలిచినట్లు సమాచారం. ఈనెల 21వ తేదీన పార్లమెంట్ హౌజ్‌లోని ప్రివిల్లేజ్ కమిటీ రూమ్‌లో బండి సంజయ్ తన స్టేట్ మెంట్ ఇచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. అనంతరం పోలీస్ కమిషనర్‌ను పిలిచి ప్రివిల్లేజ్ కమిటీ వివరణ కోరనుంది. ఇదిలా ఉండగా రాష్ట్రంలో అకాల వర్షాల వల్ల నష్టపోయిన పంటలను పరిశీలించాలని బీజేపీ జిల్లా కేడర్‌కు రాష్ట్ర నాయకత్వం ఆదేశాలిచ్చింది. నష్టపోయిన పంట వివరాలను ఆయా జిల్లా కలెక్టర్లకు ఈనెల 17వ తారీఖున ఇవ్వాలని పార్టీ ఆదేశించింది.