ఉగాది డెడ్​లైన్.. ఇక తేల్చుకుంటాం

78
Bandi Sanjai KCR

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఇస్తామని ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాలని, అలాగే 2 లక్షల ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయాలని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ కుమార్ గురువారం బహిరంగ లేఖ రాశారు. సీఎం.. ప్రధాని మోడీకి రాసిన లేఖలో పచ్చి అబద్ధాలు రాశారని, ప్రజలను తప్పుదోవ పట్టించేలా ఉందని మండిపడ్డారు. 317 జీవోను సవరించాలంటూ ఉద్యోగ, ఉపాధ్యాయుల పక్షాన బీజేపీ ఉద్యమాలు చేస్తోందని, రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 2 లక్షల ఉద్యోగ ఖాళీలను తక్షణమే భర్తీ చేయాలని నిరుద్యోగుల పక్షాన మహోద్యమానికి శ్రీకారం చుడుతున్నట్లు ఆయన స్పష్టం చేశారు. దీనిని దారి మళ్లించేందుకే ప్రధానికి లేఖ పేరిట కేసీఆర్​కొత్త డ్రామాకు తెరదీశారని ఆరోపించారు.

రైతుల ఆదాయాన్ని 2022 నాటికి రెట్టింపు చేస్తానని ఇచ్చిన మాటకు కేంద్రం కట్టుబడి ఉందని, బండి సంజయ్​పేర్కొన్నారు. ప్రొఫెసర్ ఎంఎస్ స్వామినాథన్ కమిషన్ సిఫారసుల అమలులో భాగంగా ఏటా కనీస మద్దతు ధరను పెంచడంతోపాటు రైతుల సంక్షేమం కోసం అనేక చర్యలు చేపట్టిందన్నారు. బీజేపీ అధికారంలోకి వచ్చే నాటికి వడ్లు, గోధుమలు, మొక్కజొన్న, కందులు సహా 23 రకాల పంట ఉత్పత్తులకు ఇస్తున్న కనీస మద్దతు ధరలతో పోలిస్తే నేడు 50 నుంచి 100 శాతానికిపైగా ధరలు పెరిగాయని గుర్తుంచుకోవాలన్నారు. పొరుగు రాష్ట్రాల ప్రభుత్వాలు బోనస్ పేరిట రైతులకు క్వింటాల్ ధాన్యానికి రూ.200 నుంచి రూ.600 ల వరకు చెల్లిస్తుంటే తెలంగాణలో మాత్రం నయాపైసా కూడా బోనస్ ఇవ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ధాన్యం కొనుగోలుపై కేసీఆర్​చేసిన అసంబద్ధమైన ప్రకటనల వల్ల ధాన్యం కుప్పలపైనే 50 మందికిపైగా రైతులు ప్రాణాలొదిలేశారని ఆవేదన వ్యక్తం చేశారు.

ధాన్యం కొనుగోలు చేసిన 48 గంటల్లో ఆ డబ్బులను రైతుల ఖాతాల్లో జమ చేస్తామని హామీలిచ్చి నెరవేర్చలేదని టీఆర్ఎస్​సర్కార్‌పై ధ్వజమెత్తారు. ఈ వానాకాలం ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి రైతులకు ఇంకా రూ.2,626 కోట్ల బాకీ ఉన్న సంగతి నిజం కాదా అని ఆయన ప్రశ్నించారు. మిర్చి పంటకు కనీస ధర చెల్లించాలని అడిగిన పాపానికి ఖమ్మంలో రైతులకు బేడీలు వేసి జైలుకు పంపిన నీచ చరిత్ర కేసీఆర్‌దని బండి సంజయ్ మండిపడ్డారు. ముఖ్యమంత్రికి చిత్తశుద్ధి ఉంటే ఈ అంశాలపై బహిరంగ చర్చకు సిద్ధమా అంటూ ప్రశ్నించారు. రాష్ట్ర రైతాంగానికి ఎరువులను ఫ్రీగా సరఫరా చేస్తామంటూ 2017 ఏప్రిల్ 13న మీరు హామీ ఇచ్చిన మాట ఏమైందని బండి నిలదీశారు. రైతులకు భవిష్యత్తులో ఎరువుల ఇబ్బంది రాకూడదని రూ.6100 కోట్లతో రామగుండంలో ఎరువుల ఫ్యాక్టరీని పునరుద్ధరించిన సంగతిని విస్మరించారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

తెలంగాణలో ఏటా రూ.10 వేల కోట్ల రైతుబంధు సొమ్ము ఇస్తున్నట్లు ఘనంగా చెప్పుకుంటున్న తెలంగాణ ప్రభుత్వం ఊరూరా 10 బెల్టుషాపులను తెరిచి అంతకు మూడు రెట్లు అదనంగా డబ్బు దండుకోవడం నిజం కాదా అని ప్రశ్నించారు. మద్య నిషేధ శాఖ కంటే మద్య ప్రోత్సాహక శాఖ అని మారిస్తే బాగుంటుందని ఎద్దేవా చేశారు. విద్యుత్ సంస్కరణల చట్టంలో వ్యవసాయ భూములకు విద్యుత్ మోటర్లు బిగించాలనే అంశమే లేదని, అయినా మూడేళ్లుగా ప్రతి ఎన్నికలోనూ వ్యవసాయ మోటార్లకు కరెంట్ మీటర్లు బిగిస్తున్నారంటూ దుష్ప్రచారం చేస్తూ రాజకీయ లబ్ధి పొందాలనుకోవడం హేయనీయమని మండిపడ్డారు. మూడేళ్లలో తెలంగాణలో ఒక్క రైతు పొలానికైనా కరెంట్ మీటర్లు బిగించినట్లు నిరూపించాలని, లేదంటే కేసీఆర్​తన పదవికి రాజీనామా చేయాలని సవాల్​విసిరారు.

తెలంగాణ ప్రభుత్వం రైతులకు ఉచితంగా ఎరువులను సరఫరా చేయాలని, రూ.లక్ష రుణమాఫీని పూర్తిగా అమలు చేయాలని బండి సంజయ్​డిమాండ్​చేశారు. పత్తి పంటపై క్వింటాల్ కు రూ.500 చొప్పున బోనస్ ప్రకటించాలని, రైతుల పొలాల్లో భూసార పరీక్షలు నిర్వహించాలని, వ్యవసాయ యాంత్రీకరణ సబ్సిడీల అమలు, పాలీహౌజ్‌ల ప్రోత్సాహకం, పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకాన్ని రాష్ట్రంలో అమలు చేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్​డిమాండ్​చేశారు. నకిలీ విత్తనాలను అరికట్టడంతో పాటు క్రాప్ ఇన్సూరెన్స్, మార్కెట్లో ‘ఈ-నామ్’ పద్ధతిని ప్రవేశపెట్టడమే కాక బిందు సేద్యంలో ఎస్సీలకు 90 శాతం, బీసీలకు 50 శాతం సబ్సిడీ ఇవ్వాలని బండి డిమాండ్​చేశారు. ఈ హామీలను వచ్చే ఉగాది నాటికి అమలుచేయాలని, లేదంటే రైతుల పక్షాన మరో మహోద్యమానికి శ్రీకారం చుడతామని బండి సంజయ్​హెచ్చరించారు.