‘లవ్ జిహాద్‌’పై గరం గరం..

by  |
‘లవ్ జిహాద్‌’పై గరం గరం..
X

దిశ, వెబ్‌డెస్క్ : కొన్ని రోజులుగా లవ్ జిహాద్ అనే పదం మళ్లీ తెరమీదకు వచ్చింది. ‘లవ్ జిహాద్‌ను అరికడతాం.. ధర్మాన్ని కాపాడుతాం’ అనే మాటలు వినిపిస్తున్నాయి. హర్యానా, కర్ణాటక, ఉత్తరప్రదేశ్ సహా పలు బీజేపీ పాలిత రాష్ట్రాలు దీనికి సంబంధించి ఏకంగా చట్టాలనే రూపొందించడానికి సిద్ధమవుతున్నాయి. మధ్యప్రదేశ్ హోం మంత్రి నరోత్తం మిశ్రా కూడా దీనిపై స్పందించారు. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లోనే లవ్ జిహాద్‌ను నిలువరించే చట్టాన్ని తీసుకొస్తామని అన్నారు. రాష్ట్రంలో ప్రేమ పేరుతో ‘జిహాద్‌’ను ఎట్టిపరిస్థితుల్లో జరగనివ్వమని, అందుకు తగిన నిబంధనలను తీసుకొస్తామని అన్నారు. లవ్ జిహాద్‌ను నాన్ బెయిలబుల్ నేరంగా పరిగణిస్తామని, ఈ నేరానికి పాల్పడినవారికి ఐదేళ్ల కఠిన జైలు శిక్ష విధిస్తామని తెలిపారు. ఇలాంటి బలవంతపు పెళ్లిని గుర్తించకుండా నిబంధనలు చేస్తామని, ఈ నేరానికి పాల్పడినవారితో పాటు, ప్రోత్సహించినవారినీ ప్రధాన నిందితులుగానే పరిగణిస్తామని వివరించారు. ఒకవేళ స్వచ్ఛందంగా మతమార్పిడి చేసుకోవాలనుకుంటే నెలరోజులు ముందుగానే జిల్లా మెజిస్ట్రేట్‌కు దరఖాస్తు చేసుకోవడం తప్పనిసరి అని అన్నారు.

‘లవ్ జిహాద్’ అంటే ఏమిటి?

మత మార్పిడి కోసం బలవంతంగా పెళ్లి చేసుకోవడాన్నే లవ్ జిహాద్‌గా రైట్ వింగ్ కార్యకర్తలు వ్యవహరిస్తున్నారు. హిందూ యువతులను పెళ్లి పేరుతో మతాన్ని మార్పించి హైందవేతరులు(ముఖ్యంగా ముస్లింలు) తమ ప్రాబల్యాన్ని పెంచుకుంటున్నారని, ఇది లవ్ జిహాద్ అని పేర్కొంటున్నారు. ప్రేమ, ప్రలోభాలు, మోసాలు పలువిధాల్లో అమాయక హిందూ యువతులను లోబరుచుకుని ఈ దారుణాలకు పాల్పడుతున్నారని ఆరోపిస్తున్నారు. మతాంతర వివాహాలను వ్యతిరేకిస్తూ ఈ పదాన్ని సృష్టించినట్టు ఓ వాదన ఉన్నది.

కేంద్రం గుర్తించిందా?

కేంద్ర ప్రభుత్వం మాత్రం లవ్ జిహాద్ అనే పదాన్నే గుర్తించలేదు. లవ్ జిహాద్ అనే పదం ప్రస్తుతమున్న ఏ చట్టంలోనూ లేదని, కేంద్ర దర్యాప్తు ఏజెన్సీలేవీ ఇలాంటి ఘటనలేవీ రిపోర్ట్ చేయలేవని ఈ ఏడాది ఫిబ్రవరిలో కేంద్ర ప్రభుత్వం పార్లమెంటుకు తెలిపింది. తమకు ఇష్టమైన వ్యక్తిని వివాహం చేసుకునే హక్కు రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 కల్పిస్తుండటం గమనార్హం.

హర్యానా ఘటనతో చట్టంపై ప్రకటనలు

హర్యానాలోని బల్లబ్‌గడ్‌లో నికితా తోమర్ అనే యువతి మతం మార్చుకుని తనను పెళ్లి చేసుకోవడానికి తిరస్కరించిందన్న నెపంతో తౌసీఫ్ అహ్మద్ అనే ముస్లిం యువకుడు తుపాకీతో కాల్చి చంపాడు.ఈ ఘటన ఇటీవలే చోటుచేసుకుంది. తొలుత తౌసీఫ్, అతని స్నేహితుడిపై కేసు నమోదు చేయడానికి పోలీసులు వెనుకాడారు. వెంటనే సోషల్ మీడియాలో జస్టిస్ ఫర్ నికితా పేరిట క్యాంపెయిన్‌లు సాగాయి. దీంతో రాష్ట్ర ప్రభుత్వం రంగంలోకి దిగింది. నిందితుడిని వెంటనే అరెస్టు చేశారు. ఈ ఘటన తర్వాత బీజేపీ పాలిత రాష్ట్రాలు లవ్ జిహాద్‌కు పాల్పడితే కఠిన శిక్షలు విధించే చట్టాలను రూపొందిస్తామని వరుస ప్రకటనలు చేస్తున్నాయి. అయితే, పెళ్లి చేసుకోవడానికి మతాన్ని తప్పకుండా మార్చుకోవాల్సిన అవసరం లేదని ఇటీవలే అలహాబాద్ హైకోర్టు తీర్పునిచ్చింది.

ఏయే రాష్ట్రాలు ప్రకటించాయంటే..

ఉత్తరప్రదేశ్‌లోనూ ‘లవ్ జిహాద్’ లాంటి ఘటనే జరిగిన నేపథ్యంలో సీఎం యోగి ఆదిత్యానాథ్ లవ్ జిహాద్‌ను కట్టడి చేసే చట్టం తీసుకొస్తామని ప్రకటించారు. ఈ దారుణాలకు పాల్పడేవారు తమ పద్ధతులు మార్చుకోవాలని, లేదంటే వారికి రామ్ నామ్ సత్య్ హై యాత్ర మొదలవుతుందని హెచ్చరించారు. హర్యానా సీఎం మనోహర్ లాల్ ఖట్టర్, హోం మంత్రి అనిల్ విజ్ కూడా లవ్ జిహాద్‌ను అరికట్టడానికి చట్టాన్ని తీసుకొచ్చే యోచన చేస్తున్నట్టు వెల్లడించారు. లవ్ జిహాద్‌తో మత మార్పిడిలను అడ్డుకునే చట్టాన్ని తీసుకురావడానికి ఆలోచనలు చేస్తున్నట్లు కర్ణాటక సీఎం బీఎస్ యెడియూరప్ప కూడా ఈ నెల 6న వెల్లడించారు. మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ కూడా ఇదే తరహా ప్రకటన చేశారు. బలవంతపు మత మార్పిడిలకు వ్యతిరేకంగా హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ గతేడాది ఓ బిల్లును కూడా ఆమోదించింది.



Next Story

Most Viewed