ఈటల ఇష్యూ.. బీజేపీ ఎంపీ అర్వింద్ సంచలన వ్యాఖ్యలు

by  |
BJP MP Arwind, Minister Etela Rajender, cm kcr
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్: ప్రస్తుత కరోనా పరిస్థితుల్లో జనాలు ఆక్సిజన్, రెమిడిసివర్ కొరత, డాక్టర్ల కొరతతో తీవ్ర ఇబ్బందులు పడుతుంటే సీఎం కేసీఆర్ రాజకీయాలు చేస్తున్నారని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ విమర్శించారు. మంత్రి ఈటల భూ కబ్జా ఆరోపణలపై సీఎం విచారణ ఆదేశాలపై ఎంపీ అర్వింద్ స్పందించారు. సీఎం కేసీఆర్‌తో సహా క్యాబినెట్‌లో పని చేసేది కేవలం మంత్రి ఈటల మాత్రమే కాదని గుర్తుచేశారు. ఈటల అవినీతి ఆరోపణలపై కేసీఆర్ కుంభకర్ణుడి నిద్రవీడి విచారణ చేయమని సీఎస్, విజిలెన్స్ అధికారులను ఆదేశించడం హాస్యాస్పదం అన్నారు. ప్రజాస్వామ్యంలో ఈటలకో న్యాయం? జూపల్లికో న్యాయమా? అని ప్రశ్నించారు.

అవినీతి ఆరోపణలు ఉన్న టీఆర్ఎస్ నాయకులందరిపై సీఎం కేసీఆర్ విచారణకు ఆదేశించాలని డిమాండ్ చేశారు. ఈటల గ్రాఫ్ క్రమంగా పెరుగుతోందనే అక్కసుతోనే ఆయనపై ముఖ్యమంత్రి కక్ష సాధింపు చర్యలు చేస్తున్నారని ఆరోపించారు. ఈటలపై కేసీఆర్ రాజకీయ ప్రతీకారం కోసం ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని మండిపడ్డారు. మై హోమ్ రామేశ్వరరావు అక్రమాలపై కేసీఆర్ ఎందుకు స్పందించరు? పేద ప్రజల భూదాన్ భూముల్లో ఫ్యాక్టరీలు, అటవీ భూముల్లో మైనింగ్‌లపై కేంద్రం మూడుసార్లు నోటీసులు ఇచ్చినా ఎందుకు స్పందిస్తలేరో సమాధానం చెప్పాలని ఎంపీ అర్వింద్ డిమాండ్ చేశారు.

Next Story

Most Viewed