అంతు చూస్తామని బీజేపీ నేతలకు టీఆర్ఎస్ ప్రజాప్రతినిధుల హెచ్చరిక

80
trs

దిశ, తెలంగాణ బ్యూరో : సోషల్ మీడియాలో టీఆర్ఎస్ నేతలపై బీజేపీ సోషల్ వింగ్ తప్పుడు ప్రచారం చేస్తోందని దానిపై విచారణ జరిపి పోలీసులు చర్యలు తీసుకోకపోతే తామే రంగంలోకి దిగి వారి అంతుచూస్తామని టీఆర్ఎస్ దళిత ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు హెచ్చరించారు. దళిత ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలపై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం పై డీజీపీ కార్యాలయంలో శుక్రవారం అడిషనల్ డీజీ జితేందర్ కు వినతిపత్రం అందజేశారు.

హుజురాబాద్ ఉప ఎన్నికల సందర్భంగా టీఆర్ఎస్ ఎమ్మెల్యేల పై ఫేక్ వీడియో తయారు చేసి ప్రతిష్టను దెబ్బతీస్తున్నారని ఆరోపించారు. ఫేక్ వీడియో పై పూర్తి స్థాయి విచారణ జరిపించాలని కోరారు. ఈ సందర్భంగా ఎంపీ వెంకటేష్ నేత, ప్రభుత్వ విప్ బాల్క సుమన్, ఎమ్మెల్యేలు కాలే యాదయ్య, క్రాంతి కిరణ్, అర్రూరి రమేష్, హన్మంతు షిండే, ఎమ్మెల్సీ ప్రభాకర్ లు మాట్లాడుతూ తెలంగాణ లో దళిత ఎమ్మెల్యే లను, ఎమ్మెల్సీలను, ఎంపీల వ్యక్తిత్వాన్ని దెబ్బతీయాలని ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేయాలనికోరారు.

బండి సంజయ్ , కిషన్ రెడ్డి కి కుటుంబాలు ఉన్నాయని, వారింట్లో ఆడవారి మీద ఫేక్ వీడియోలు తయారు చేయాలంటే ఒక్క నిమిషం పట్టదని, కానీ మాకు సంస్కారం ఉందన్నారు. బీజేపీ నేతలు చిల్లర రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. ఎమ్మెల్యే గువ్వల బాలరాజు మీద , చాలా ఫేక్ వీడియోలు పెట్టారని ఆరోపించారు. దళిత నేతల ఎదుగుదల చూసి బీజేపీ ఓర్చుకోవడం లేదన్నారు. చట్ట ప్రకారం సోషల్ మీడియాల్లో తప్పుడు పోస్టులు పెడుతున్న వారి పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సోషల్ మీడియాల్లో ఫేక్ వీడియోలు పెడుతున్న వారిపై సుమోటోగా కేసులు నమోదు చేయాలని కోరారు.

ముఖ్యమంత్రి దగ్గరి నుండి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల పై ఫేక్ వీడియో లు చేసిన, సోషల్ మీడియాలో పెట్టిన వారిపై వెంటనే టీఆర్ఎస్ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేయాలని పిలుపు నిచ్చారు. బండి సంజయ్ నుంచి ఈటల వరకు ఎవర్ని వదలబోమని స్పష్టం చేశారు. అభివృద్ధి మీద సంక్షేమం మీద కొట్లాడాలి కానీ చిల్లర రాజకీయాలు చేయొద్దని కోరారు. వ్యక్తిగత ప్రతిష్టను దెబ్బతీయకుండా ఉండాలని, సోషల్ మీడియాలో దళిత నేతలను బీజేపీ టార్గెట్ చేస్తుందని మండిపడ్డారు. సోషల్ మీడియా ను వేదికగా చేసుకుని దళిత నాయకుల పై బురద జల్లుతున్నారని ఆరోపించారు. బీజేపీ నాయకులు డైరెక్ట్ గా ఎదుర్కొనలేక తప్పడు ప్రచారం చేస్తున్నారని, ఇకనైనా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ బుద్ధి మార్చుకోవాలని సూచించారు.