ప్రచారంలో ఎక్కువ ఖర్చు బీజేపీదే

by  |
ప్రచారంలో ఎక్కువ ఖర్చు బీజేపీదే
X

న్యూఢిల్లీ : సోషల్ మీడియా ప్రముఖ వేదిక అయిన ఫేస్‌బుక్‌లో ప్రచారానికి చేసిన ఖర్చులో బీజేపీ టాప్‌లో నిలిచింది. సామాజిక అంశాలు, ఎన్నికలు, రాజకీయ విషయాలపై ప్రచారానికి గత ఏడాది ఫిబ్రవరి నుంచి బీజేపీ సుమారు రూ. 4.61 కోట్లను వెచ్చించింది. సోషల్ మీడియాలో ఖర్చులను పర్యవేక్షించే ఒక ట్రాకర్ వివరాల ప్రకారం ఈ నెల 24 వరకు ఫేస్‌బుక్ ఇండియాలో బీజేపీ తర్వాత రూ. 1.84 కోట్లతో కాంగ్రెస్ రెండో స్థానంలో ఉన్నది.

ఫేస్‌బుక్‌లో టాప్‌టెన్ అడ్వర్టయిజర్‌లలో బీజేపీతో లింక్ ఉన్న రెండు పేజీలు, ఒక వెబ్‌సైట్‌తోపాటు బీజేపీ మాజీ ఎంపీ ఆర్‌కే సిన్హాకు చెందిన పేజీలున్నాయి. ఈ నాలుగింటిలో మూడింటి చిరునామా ఢిల్లీలోని బీజేపీ హెడ్‌క్వార్టర్‌ను పేర్కొనడం గమనార్హం. ఈ పేజీలు ప్రధాని మోడీ, బీజేపీకి మద్దతుగా ప్రచారం చేశాయి. కానీ, నేరుగా బీజేపీతో సంబంధాలున్నట్టు ఎక్కడా పేర్కొనలేవు.

‘మై ఫస్ట్ వోట్ ఫర్ మోడీ’ అనే పేజీ రూ. 1.39 కోట్లు, ‘భారత్ కే మన్ కీ బాత్’ పేజీ రూ. 2.24 కోట్లు, న్యూస్ అండ్ మీడియా వెబ్‌సైట్‌గా విభజితమైన ‘నేషన్ విత్ నమో’ రూ. 1.28 కోట్లు యాడ్స్‌పై ఖర్చుపెట్టాయి. అలాగే, బీజేపీ నేత ఆర్‌కే సిన్హా అనుబంధంగా ఉన్న పేజీ రూ. 0.65 కోట్లు ఖర్చుపెట్టారు. వీటితోపాటు బీజేపీ ఖర్చులను కూడా కలిపితే రూ. 10.17 కోట్లను ఫేస్‌బుక్ ఇండియాలో యాడ్స్ కోసం ఖర్చుపెట్టినట్టయింది. ఈ కేటగిరీలో టాప్ టెన్ అడ్వర్టయిజర్‌లు వెచ్చించిన మొత్తం(రూ. 15.81కోట్లు)లో బీజేపీ, దానితో సంబంధమున్న పేజీలు, వెబ్‌సైట్లకే 64శాతం ఖర్చుపెట్టడం గమనార్హం.

భారత్‌లో ఫేస్‌బుక్ వ్యాపార అవసరాల కోసం హింసను ప్రేరేపించే, అభ్యంతరకర పోస్టులైనప్పటికీ బీజేపీ అనుబంధ సంస్థలు, కనీసం నలుగురు నేతలకు మినహాయింపునిస్తూ చర్యలు తీసుకోవడం లేదని ఫేస్‌బుక్ ఇండియా పాలసీ హెడ్ వ్యాఖ్యలను ప్రచురించిన వాల్‌స్ట్రీట్ జర్నల్ కథనం దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ(ఐటీ) ఫేస్‌బుక్ ఇండియా నుంచి వివరణ అడిగింది.

Next Story

Most Viewed