- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
సమరానికి 'సై'.. ఢిల్లీ టూర్ తర్వాత బీజేపీ దూకుడు

దిశ, తెలంగాణ బ్యూరో: టీఆర్ఎస్ను గద్దె దింపడమే తమ టార్గెట్‌గా బీజేపీ పెట్టుకుంది. టీఆర్ఎస్ను ఎదుర్కొనేందుకు కావాల్సిన ఫుల్సపోర్ట్ను కేంద్రం ఇస్తానని చెప్పడంతో రాష్ట్ర నేతల్లో జోష్ మరింత పెరిగింది. టీఆర్ఎస్కు మాటకు మాట.. బదులు చెప్పాలని, ఎప్పటికప్పుడు తెలంగాణ ప్రభుత్వ విధివిధానాలను తిప్పికొట్టాలని రాష్ట్ర బీజేపీ నేతలు ప్లాన్ చేస్తున్నారు. దీనికి సంబంధించిన మైండ్‌గేమ్‌ను షురూ చేస్తున్నారు. ఢిల్లీ టూర్ అనంతరం నేతల యాక్షన్ ప్లాన్ షురూ చేశారు. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న అతిపెద్ద సమస్య నిరుద్యోగం. ఈ అంశం నుంచే ప్రజల్లో టీఆర్ఎస్ పై వ్యతిరేకతను తీసుకురావాలని బీజేపీ అధిష్టానం భావిస్తోంది. అందుకే ఈనెల 27వ తేదీన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్నిరుద్యోగ దీక్షకు పిలుపునిచ్చారు. ఇప్పటికే రాష్ట్రంలో మొదటి విడత ప్రజా సంగ్రామ యాత్రను పూర్తి చేసిన బండి నిరుద్యోగ దీక్షకు పూనుకున్నారు. కాగా ఈ దీక్ష అనంతరం రెండో విడత ప్రజా సంగ్రామ యాత్ర చేపట్టే అవకాశాలున్నాయి.
స్వరాష్ట్రంలో రోజురోజుకూ నిరుద్యోగుల ఆత్మహత్యలు పెరిగిపోతున్నాయి. అయితే నిరుద్యోగులెవరూ ఆత్మహత్యలు చేసుకోకుండా ఉండేలా వారిలో భరోసా నిపేందుకు బీజేపీ శ్రేణులు నిరుద్యోగ దీక్షకు పిలుపునిచ్చాయి. ఈ దీక్ష ద్వారా ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపుతూ ప్రజల్లో టీఆర్ఎస్పై వ్యతిరేకత పెంచి బీజేపీకి మద్దతు పెరిగేలా నేతలు ప్రణాళికలు చేస్తున్నారు. స్వరాష్ట్రం సాధించిందే.. నీళ్లు, నిధులు, నియామకాల కోసం. అయితే రాష్ట్రంలో నీళ్లు కేసీఆర్ ఫాంహౌస్‌కు, నిధులు కేసీఆర్అనుచరులకు, నియామకాలు ఆయన కుటుంబానికి మాత్రమే దక్కాయని బీజేపీ నేతలు టీఆర్ఎస్పై యుద్ధానికి దిగనున్నారు. పీఆర్సీ నివేదిక ప్రకారం 1.92 లక్షల ఉద్యోగ ఖాళీలున్నాయని రాష్ట్రమే ప్రకటించింది. కాగా బీజేపీ నేతలు విమర్శనాస్త్రంగా దీనినే పెట్టుకోనున్నారు.
బీజేపీ ఆధ్వర్యంలో నవంబర్ 16వ తేదీన ట్యాంక్ బండ్ పై నిరుద్యోగ మిలియన్ మార్చ్ చేపట్టాలని నాయకులు ప్లాన్ చేశారు. దీనికి సంబంధించి అన్ని యూనివర్సిటీల్లో నేతలు రౌండ్ టేబుల్ సమావేశాలు, చైతన్య ర్యాలీలు నిర్వహించారు. అయితే ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ నేపథ్యంలో జిల్లాల నుంచి జన సమీకరణ చేయలేని పరిస్థితి నెలకొంది. నిరుద్యోగ సమస్య, ఉద్యోగ నోటిఫికేషన్లపై పోరు చేయాలనుకున్న బీజేపీకి ఎమ్మెల్సీ కోడ్ రూపంలో బ్రేక్ పడింది. దీంతో నిరుద్యోగ మిలియన్ మార్చ్ వాయిదా పడింది. కాగా తాజాగా రాష్ట్ర నేతల ఢిల్లీ టూర్ తర్వాత నేతలు దూకుడుగా వ్యవహరిస్తున్నారు. మళ్లీ బండి సంజయ్నిరుద్యోగ సమస్యపైనే టీఆర్ఎస్పై పోరు చేయాలని నిరుద్యోగ దీక్షకు పిలుపునిచ్చారు. ఇదిలా ఉండగా నిరుద్యోగ దీక్షను విజయవంతం చేసే బాధ్యతను బీజేపీ యువ మోర్చాకు అప్పగించింది. ఈ దీక్షలో వీరు కీలకంగా వ్యవహరించనున్నారు. అన్ని జిల్లాల నుంచి నిరుద్యోగ యువతను దీక్షకు తీసుకువచ్చే బాధ్యతను బీజేపీ వీరికి అప్పగించింది.
ఏర్పాట్లలో నేతలు..
ఈ నెల 27వ తేదీన ఇందిరా పార్క్ వద్ద బీజేపీ ఆధ్వర్యంలో చేపట్టే నిరుద్యోగ దీక్ష సభా స్థలిని ఆ పార్టీ శ్రేణులు పరిశీలించాయి. బీజేపీ నేతలు మనోహర్‌రెడ్డి, ప్రదీప్‌కుమార్‌గౌడ్ ఏర్పాట్లను పర్యవేక్షించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం మోసం చేసిన తీరును నిరుద్యోగులకు అర్థమయ్యేలా చెప్పాలని వారు భావిస్తున్నారు. ఇందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించుకున్నట్లు వెల్లడించారు.
సర్కార్ దిగొచ్చేలా ‘నిరుద్యోగ దీక్ష’ : బండి సంజయ్
కేసీఆర్ ప్రభుత్వం దిగొచ్చేలా 27న ఇందిరా పార్క్ వద్ద ‘నిరుద్యోగ దీక్ష’ చేపడుతున్నట్లు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ కుమార్ శనివారం తెలిపారు. రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలకు నిరుద్యోగ సమస్యే ఇకపై ఎజెండాగా మారాలన్నారు. అలాగే జోనల్ కేటాయింపుల్లో భాగంగా ఉద్యోగులకు జరుగుతున్న అన్యాయం, ఇంటర్మీడియట్ విద్యార్థుల ఆత్మహత్యలపైనా ఈ దీక్ష వేదికగా ప్రభుత్వాన్ని నిలదీస్తామని ఆయన పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో విద్యార్థి, నిరుద్యోగ సంఘాల నాయకులతో బండి సంజయ్ సమావేశమయ్యారు. ప్రతి నిరుద్యోగి ఈ దీక్షలో పాల్గొనాలని ఆయన సూచించారు. బీజేపీ అంటే కేసీఆర్ కు భయమని, బీజేపీతో టీఆర్ఎస్ ప్రభుత్వానికే ఎసరొచ్చే ప్రమాదముందని, నిరుద్యోగ సమస్యను దారి మళ్లించేందుకు కొత్త సమస్యను సృష్టిస్తున్నారన్నారు. ధాన్యం కొనుగోళ్ల అంశంపై లేనిపోని రాద్ధాంతం చేస్తున్నారని బండి మండిపడ్డారు. కేసీఆర్ ట్రాప్ లో ఎవరూ పడొద్దని, ఇప్పుడు కేసీఆర్ కు నిరుద్యోగుల సత్తా ఏంటో చూపాల్సిన సమయం ఆసన్నమైందని వ్యాఖ్యానించారు. కాగా 15 నిరుద్యోగ సంఘాలు నిరుద్యోగ దీక్షకు మద్దతు తెలిపినట్లు బీజేపీ శ్రేణులు వెల్లడించాయి.