‘మోడీని కేసీఆర్ కలిసి వంగివంగి దండాలు పెడతడు’

by  |
‘మోడీని కేసీఆర్ కలిసి వంగివంగి దండాలు పెడతడు’
X

దిశ, మెదక్ : వరి వేసుకుంటే ఉరి వేసుకున్నట్లేనంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యాఖ్యలతో భయపడిన రైతన్నలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ అన్నారు. కేసీఆర్ వ్యాఖ్యల వల్ల ఐదుగురు రైతులు ఆత్మహత్య చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి పూర్తి బాధ్యత కేసీఆర్ వహించాలని ఆయన డిమాండ్ చేశారు. మంగళవారం బండి సంజయ్ పాదయాత్ర మెదక్ జిల్లా కేంద్రానికి చేరుకుంది. బోనాలు, డప్పు చప్పుళ్లతో పాదయాత్రకు బ్రహ్మరథం పట్టారు. ఈ సందర్భంగా రాందాస్ చౌరస్తాలో ఏర్పాటు చేసిన సభలో బండి సంజయ్ మాట్లాడారు. ప్రజల బాధలు తెలుసుకొని వారికి బరోసా ఇచ్చేందుకే ప్రజా సంగ్రామ యాత్ర చేస్తున్నట్లు ప్రకటించారు. ప్రజల్లో అయోమయం సృష్టించేందుకు బీజేపీ టీఆర్ఎస్ పార్టీలు ఒక్కటేనని కాంగ్రెస్ నాయకులు దుష్ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు.

ఏ నాడు బీజేపీ, టీఆర్ఎస్ కలిసి పోటీ చేయలేదని, పోటీ చేసిన చరిత్ర టీఆర్ఎస్, కాంగ్రెస్, ఏంఐఏం, టీడీపీ పార్టీలకు ఉందన్నారు. టీఆర్ఎస్ కు ప్రత్యమ్నాయం బీజేపీ అని చెప్పారు. వచ్చే ఎన్నికలలో తెలంగాణలో కాషాయపు జెండా ఎగరడం ఖాయం అన్నారు. సీఎం కేసీఆర్ నరేంద్రమోడీని కలిసి వంగివంగి దండాలు పెడతాడని, బయటకొచ్చి మోడీ నన్ను పొగిడారని ప్రచారం చేసుకుంటారని ఎద్దేవా చేశారు. ఆనాడు తెలంగాణకు మోదీ నిధులిస్తుండు.. రుణపడి ఉంటామని చెప్పిన కేసీఆర్, ఇప్పుడు దుష్ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. మోదీ ఏమీ చేయకపోతే కేంద్రానికి లేఖ రాసే దమ్ముందా? అని కేసీఆర్ ను అడిగితే సమాధానం కూడా చెప్పలేదన్నారు.

ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి బాబూ మోహన్, దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు, పాదయాత్ర ప్రముఖ్ డాక్టర్ జి.మనోహర్ రెడ్డి, జిల్లా పార్టీ అధ్యక్షులు గడ్డం శ్రీనివాస్, రాష్ట్ర అధికార ప్రతినిధి రాకేశ్ రెడ్డి, జడ్పీ మాజీ చైర్ పర్సన్ తుల ఉమ, బీజేపీ రాష్ట్ర నాయకులు నందు జనార్దన్ రెడ్డి, వెలుముల శిద్దరాములు, రవీందర్ రెడ్డి, ఎంఎన్ఎల్ఎన్ రెడ్డి, సుభాష్ గౌడ్ తో పాటు మెదక్, నర్సాపూర్ నియోజక వర్గం నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


Next Story