ప్రజా సమస్యలపై బీజేపీ ఫోకస్.. ఐదు తీర్మానాలకు ఆమోదం

by  |
BJP logo
X

దిశ, తెలంగాణ బ్యూరో: ప్రజా సమస్యలను తెలుసుకోవడమే కాకుండా రాష్ట్ర ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ఎండగట్టాలని బీజేపీ నాయకులు కార్యాచరణ రూపొందిస్తున్నారు. బండ్లగూడలోని మహావీర్​ఇంజినీరింగ్ కాలేజీలో రెండో రోజు నిర్వహించిన బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు శనివారంతో ముగిశాయి. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్​ పార్టీ జెండాను ఆవిష్కరించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఐదు తీర్మానాలను రాష్ట్ర కార్యవర్గం ఆమోదించింది. అందులో రాజకీయ, రైతు సమస్యలు. దళిత బంధు అమలు, ధరణి లోపాలు, ఉద్యోగాల భర్తీ తీర్మానాలు ప్రవేశపెట్టారు. దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు రాజకీయ తీర్మానం ప్రతిపాదించగా.. జాతీయ కార్యవర్గ సభ్యుడు, ఎమ్మెల్యే ఈటల రాజేందర్​ సమర్థించారు. బీజేపీ తమిళనాడు రాష్ట్ర కో-ఇన్​చార్జ్ పీ సుధాకర్ రెడ్డి నిరుద్యోగ సమస్యపై తీర్మానం ప్రతిపాదించగా.. మాజీ మంత్రి చంద్రశేఖర్ ఈ తీర్మానాన్ని సమర్థించారు. అనంతరం రాష్ట్ర కార్యవర్గం ఈ తీర్మానాలను ఆమోదించింది. అనంతరం పలు కీలక అంశాలపై చర్చించినట్లు బీజేపీ శ్రేణులు వెల్లడించాయి.

హుజూరాబాద్ ఎన్నికల ఫలితాలు తెలంగాణ రాజకీయ ముఖ చిత్రాన్ని మార్చబోతున్నట్లు వారు పేర్కొన్నారు. విద్యార్థులకు ఫీజు రీయింబర్స్ మెంట్, అభివృద్ధి సంక్షేమ పథకాలకు నిధులు పెంచాలని రాష్ట్ర సర్కార్​పై ఒత్తిడి తేవాలని నిర్ణయించారు. టీఆర్ఎస్ నాయకులు ఇసుకను అక్రమంగా తరలిస్తూ వ్యాపారం చేస్తుండటంపై ఫోకస్​ పెట్టనున్నారు. మైనింగ్ ను టీఆర్ఎస్ మాఫియా తమ చేతుల్లోకి తీసుకోవడాన్ని అరికట్టాలని ఈ సమావేశాల్లో చర్చించారు. గంజాయితో పాటు ఇతర మాదకద్రవ్యాల వ్యాపారం వెనుక ఉన్న విదేశాంగ శక్తులను అడ్డుకట్ట వేయాలని బీజేపీ నేతలు ప్లాన్ ​చేస్తున్నారు. సీఎం కేసీఆర్ దళిత ద్రోహిగా మారారని, దళిత బంధు అమలు నెపంతో ఎస్సీ సబ్ ప్లాన్, కార్పొరేషన్ సబ్ ప్లాన్ , సబ్సిడీలను ప్రభుత్వం ఎత్తివేయాలని భావిస్తోందన్నారు. ఎస్సీ వర్గాన్ని మోసం చేస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కొవాల్సి వస్తుందని హెచ్చరికలు జారీ చేసినట్లు తెలుస్తోంది. ఒకే విడతలో రుణమాఫీ చేసి, వ్యవసాయ ఆధారిత పరిశ్రమలను ప్రోత్సాహించాలని నిర్ణయించారు.

రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే వర్షానికి తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని బీజేపీ శ్రేణులు టీఆర్​ఎస్​పై ఒత్తిడి తెచ్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. రైతులు ప్రత్యామ్నాయ పంటలకోసం సబ్సిడీపై విత్తనాలు.. వ్యవసాయ పరికరాలు అందించాలని ప్రతిపాదించారు. పంట రుణాలను వడ్డీ లేకుండా ఇవ్వడంతో పాటు ఫసల్ బీమా యోజనను అమలుచేయాలని కేసీఆర్​పై ఒత్తిడి తేవాలని ప్లాన్ ​చేస్తున్నారు. రెవెన్యూ సంస్కరణల పేరుతో కేసీఆర్ తుగ్లక్ నిర్ణయాలు తీసుకోవడంపై ఈ సమావేశంలో బీజేపీ శ్రేణులు మండిపడ్డాయి. ధరణి పేరుతో టీఆర్ఎస్ నాయకులు భూ దందాలకు పాల్పడుతున్నారని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న విలువైన భూములను టీఆర్ఎస్ అవినీతికి కేంద్రాలుగా వినియోగించుకుంటోందని బీజేపీ ఆరోపణలు చేస్తోంది. ఉద్యోగాల కల్పనలో తెలంగాణ ప్రభుత్వం విఫలం కావడాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని బీజేపీ రాష్ట్ర శాఖ భావిస్తోంది. ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయడమే కాక, ఉద్యోగ నియామక క్యాలెండర్ విడుదల చేయాలని, అలాగే ఎస్సీ, ఎస్టీ బ్యాక్ లాగ్ పోస్ట్ లు వెంటనే భర్తీ చేయాలని ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని బీజేపీ నాయకులు నిర్ణయం తీసుకున్నారు.



Next Story

Most Viewed