సిడ్నీలోని 5 స్టార్ జైల్లో టీమిండియా..?

by  |
సిడ్నీలోని 5 స్టార్ జైల్లో టీమిండియా..?
X

దిశ, స్పోర్ట్స్ : ఆట ఆడినంత సేపు.. సాధన చేసేంత వరకు మాత్రమే మిగిలిన వాళ్లతో కలసిసుండటం. మిగతా సమయమంతా నాలుగు గోడల మధ్యే గడపాలి. లంచ్, డిన్నర్ ఒంటరిగా చేయాలి. కుటుంబానికి దూరంగా ఎక్కడో ఐదు నక్షత్రాల హోటల్ గదిలో.. సాటి ఆటగాళ్లు దగ్గరగానే ఉన్నా.. మాట్లాడే అవకాశం లేకపోవడం. ఇదీ బయోసెక్యూర్ పేరుతో గత కొన్ని నెలలుగా ఆటగాళ్లు పడుతున్న ఇబ్బంది.

క్రికెటర్లు శారీరికంగా బలంగా ఉండటం ఎంత ముఖ్యమో.. మానసికంగా ధృఢంగా ఉండటం అంతకంటే అవసరం. కానీ, కరోనా మహమ్మారి కారణంగా క్రికెట్ తిరిగి ప్రారంభమైనా.. బయోబబుల్‌లో ఉండటం ఆటగాళ్లను తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నది. టీమ్ ఇండియా, ఇంగ్లాండ్, ఆసీస్ ఆటగాళ్లు వరుస పర్యటనలు, ఐపీఎల్ కారణంగా మూడు నెలలుగా బయోసెక్యూర్ వాతావరణంలో ఉంటున్నారు. ఈ బయోబబుల్ వాతావరణం ఆసీస్‌లో కూడా కొనసాగుతుండటంతో మానసికంగా ప్రభావం చూపుతున్నది.

ఆసీస్‌లో కఠిన నిబంధనలు..

గత 100 రోజులుగా టీమ్ ఇండియా క్రికెటర్లు బయోబబుల్‌లో గడుపుతున్నారు. యూఏఈలో బయోసెక్యూర్ వాతావరణంలో ఆయా జట్ల క్రీడాకారులు కనీసం గ్రూప్ మీటింగ్స్‌లో అయినా గడిపే వాళ్లు. కానీ ప్రస్తుతం సిడ్నీలో ఉన్న టీమ్ ఇండియాకు అలాంటి అవకాశం కూడా దక్కడం లేదంటా. కేవలం సాధన చేసే సమయంలో తప్ప మిగతా సమయంలో ఫైవ్ స్టార్ హోటల్ గదుల్లో ఒంటరిగా ఉంటున్నారంటా. ఇందొక ‘ఫైవ్ స్టార్ జైలు’ లా ఉందని టీమ్ ఇండియా క్రికెటర్లు అంటున్నారు.

ఆస్ట్రేలియాలో కొవిడ్ కేసులు పెరుగుతుండటంతో కఠినమైన నిబంధనలు అమలు చేస్తున్నారు. దీంతో టీమ్ సభ్యులు సాధనకు వెళ్లడానికి కూడా నాలుగు పెద్ద బస్సుల్లో వెళ్లాల్సి వస్తుంది. బస్సుల్లో కూడా భౌతిక దూరం పాటించడం, గ్రూప్ మీటింగ్స్‌కు అనుమతించకపోవడంతో ఒంటరిగా ఉంటున్నారంటా. మరోవైపు హోటల్ జిమ్‌ను ఉపయోగించుకోవడానికి కూడా వీలు లేకుండా పోయింది. సాధన కోసం తప్ప హోటల్ రూమ్ దాటి బయటకు రావొద్దనే నిబంధన అమలులో ఉన్నది. దీంతో ఆటగాళ్లు మానసికంగా కుంగిపోతున్నారని టీమ్ మేనేజ్‌మెంట్‌లోకి కీలక వ్యక్తి వ్యాఖ్యానించారు.

బయోసెక్యూర్‌లో ఉండటం కష్టమే..

కొవిడ్-19 కారణంగా పదే పదే బయోసెక్యూర్ వాతావరణంలో గడపడం చాలా కష్టంగా ఉన్నదని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ వ్యాఖ్యానించాడు. ఇంత సుదీర్ఘ కాలం ఒంటరిగా గడపడం వల్ల మానసికంగా బలహీనపడుతున్నారని అన్నాడు. ఆటగాళ్ల మధ్య అప్పుడప్పుడు గ్రూప్ డిస్కషన్స్ జరుగుతున్నప్పుడే ఒంటరిగా ఉన్నామనే భావన తగ్గుతుందని కోహ్లీ అన్నాడు.

మరోవైపు బయోసెక్యూర్ వాతావరణంలో గడిపిన జోఫ్రా ఆర్చర్ కూడా తాను ఇక ఇలా గడపలేనని చెప్పాడు. ఐపీఎల్ ఎప్పుడు అయిపోతుందా అని ఎదురు చూశాను.. కానీ ఇప్పుడు సౌతాఫ్రికా పర్యటన కోసం మరోసారి బయోబబుల్‌లో ఉండాల్సి వస్తున్నది. ఇది తనను మానసికంగా కృంగదీస్తోందని అన్నాడు. మాంచెస్టర్‌లో ఈ వాతావరణంలో ఉండలేక ఒకసారి ఇంటికి వెళ్లిపోయాను. కానీ టీమ్ తరపున ఆడాలి కాబట్టి తిరిగి ఐసోలేషన్‌లో ఉండి జట్టుతో చేరాను. ఆటగాళ్లకు ఈ వాతావరణం కారణంగా ఇబ్బందులు ఎదురవుతున్నాయి అని ఆర్చర్ అన్నాడు.

ఎవరెవరు ఎప్పటి నుంచి?

కరోనా మహమ్మారి తర్వాత పలు జట్లు తిరిగి క్రికెట్ ఆడుతున్నాయి. ఈ క్రమంలో ఆయా జట్లు కొన్ని వారాల పాటు బయోసెక్యూర్ వాతావరణంలో ఉన్నాయి. అందరికంటే ముందు బయోబబుల్‌లో ప్రవేశించినవి వెస్టిండీస్, ఇంగ్లాండ్ జట్లు. ఆ తర్వాత పాకిస్తాన్ జట్టు ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లి అక్కడ బయోబబుల్‌లో గడిపింది. ఆ తర్వాత ఆసీస్ జట్టు ఇంగ్లాండ్ వెళ్లి బయోసెక్యూర్ వాతావరణంలో గడిపింది.

ఇక ఐపీఎల్ కోసం యూఏఈలో టీమ్ ఇండియాతో సహా ఇతర దేశాల ఆటగాళ్లు బయోబబుల్‌లో గడిపారు. తాజాగా టీమ్ ఇండియా, ఆసీస్ జట్లు ఆస్ట్రేలియాలో బయోసెక్యూర్ వాతావరణంలో ఉంటున్నాయి. జనవరి రెండో వారం వరకు ఈ రెండు జట్లు అలా ఒంటరిగా గడపాల్సిందే. కరోనా మహమ్మారి ఇప్పట్లో తగ్గుముఖం పట్టేలా లేకపోవడంతో బయోసెక్యూర్ కొనసాగించడంతో ఆటగాళ్లకు ఇబ్బందులు తప్పడం లేదు.

Next Story