Bandi Sanjay: ప్రధాని హైదరాబాద్ టూర్.. తెర వెనుక బండి సంజయ్ భారీ వ్యూహం!

by Disha Web Desk 2 |
Bandi Sanjay: ప్రధాని హైదరాబాద్ టూర్.. తెర వెనుక బండి సంజయ్ భారీ వ్యూహం!
X

Bandi Sanjay huge strategy for PM Modi hyderabad tour

దిశ, వెబ్‌డెస్క్: బీజేపీ అగ్రనేతలు తెలంగాణకు క్యూ కట్టారు. ఇప్పటికే ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా(J.P. Nadda), కేంద్ర హోం మంత్రి అమిత్ షా(Amit Shah) రాష్ట్రంలో పర్యటించగా తాజాగా, మే 26 ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ(Modi) హైదరాబాద్‌కు రానున్నారు. మూడు వారాల వ్యవధిలో ముగ్గురు అగ్రనేతల రాష్ట్ర పర్యటనతో తెలంగాణ బీజేపీలో ఉత్సాహం రెట్టింపు అవుతోంది. వాస్తవానికి ప్రధాన మంత్రి పర్యటన పార్టీ పరమైనది కాదు. హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఐఎస్బీ వార్షికోత్సవంలో ఆయన పాల్గొననున్నారు. అయితే వార్షికోత్సవ కార్యక్రమానికి ముందే పీఎంతో రాష్ట్ర నేతల భేటీకి తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్(Bandi Sanjay) ప్రయత్నం చేస్తుండటం రాష్ట్ర రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది.

పీఎం పర్యటన నేపథ్యంలో ప్రధానికి ఎయిర్ పోర్ట్‌లో ఘన స్వాగతం పలికేలా రాష్ట్ర బీజేపీ నేతలు కసరత్తు చేస్తున్నారు. ఈ క్రమంలో బేగంపేట ఎయిర్ పోర్ట్‌లో పార్టీ నేతలు ప్రధాన మంత్రిని కలిసేలా రిసెప్షన్ ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ మేరకు అనుమతి కోసం పీఎంవోకు బండి సంజయ్ సమాచారం అందించారని.. దీనిపై ప్రధాన మంత్రి కార్యాలయం ఇంకా నిర్ణయం తీసుకోవాల్సి ఉందని తెలుస్తోంది. నిజానికి ఈనెల 26న రామగుండంలోని ఎరువుల ఫ్యాక్టరీ, హైదరాబాద్ శివారు జినోంవ్యాలీలో నిర్మాణం పూర్తయిన నేషనల్ యానిమల్ రిసోర్స్ ఫెసిలిటీ ఫర్ బయోమెడికల్ రీసెర్చ్‌లను మోడీ చేతుల మీదుగా ప్రారంభించేలా పీఎంఓకు ప్రతిపాదనలు పంపినట్లు తెలిసింది. కానీ, ఇప్పటి వరుకు వీటి విషయంలో అధికారిక ప్రకటన రాలేదు. పీఎం షెడ్యూల్‌లో ఐఎస్బీ కార్యక్రమం మాత్రమే ఉండటంతో ఉన్న సమయంలోనే పీఎంను కలిసేలా ప్లాన్ చేస్తున్నారట. అపాయింట్ మెంట్ లభిస్తే గనుక రాష్ట్రంలో పార్టీ పరిస్థితిని వివరించే ప్రయత్నం చేయబోతున్నారట.

ప్రజాసంగ్రామ యాత్ర సక్సెస్ కావడం పట్ల నరేంద్ర మోడీ నేరుగా బండి సంజయ్‌కు ఫోన్ చేసి అభినందనలు తెలిపిన సంగతి తెలిసిందే. అయితే రాష్ట్రంలోని అధికార టీఆర్ఎస్ ప్రధాని నరేంద్ర మోడీ, బీజేపీ పార్టీని టార్గెట్‌గా చేసుకుని విమర్శలకు దిగుతున్నారు. ఈ క్రమంలో పీఎంతో తెలంగాణ నేతలకు అపాయింట్ మెంట్ లభిస్తే పార్టీ శ్రేణుల్లో మరింత ఉత్సాహం పెరుగుతుందని రాష్ట్ర నాయకత్వం భావిస్తోంది. ఇదే సమయంలో అనుసరించాల్సిన వ్యూహాలపై స్టేట్ లీడర్లకు పీఎం దిశానిర్దేశం చేసే ఛాన్స్ ఉంటుంది. ఈ నేపథ్యంలోనే మే 26న కాసేపు పార్టీ కోసం పీఎం టైమ్ కేటాయించేలా ప్రణాళికలు రచిస్తున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ నుండి రాహుల్ గాంధీ, బీజేపీ నుండి జేపీ నడ్డా, అమిత్ షా పర్యటించగా తాజాగా మోడీ సైతం రానుండటంతో రాష్ట్ర రాజకీయాలు మరో సారి హీటెక్కనున్నారు.


Next Story

Most Viewed