మీలాంటి సీఎం ఉండకూడదు: భట్టి విక్రమార్క

by  |
Bhatti, Jaggareddy
X

దిశ, తెలంగాణ బ్యూరో : గతంలో పోలియో వ‌స్తే కాంగ్రెస్​ ప్రభుత్వం వెంటపడి పోలియో చుక్కలు వేసిందని, కేసీఆర్‌ వంటి సీఎం, పీఎంగా ఉన్నా దేశంలో సగం మంది వైకల్యంతో ఉండేవారని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మండిపడ్డారు. సీఎం కేసీఆర్‌ ముందు బయటకు రావాలని, ప్రజల పరిస్థితి అర్థం చేసుకోవాలని సూచించారు. ఇప్పుడు చీఫ్ సెక్రెట‌రీ అన్నీ ఉన్నాయ‌ని అంటున్నారని, తనతో వస్తే బయట ఆసుపత్రులు తిరుగుదామని సవాల్‌ విసిరారు. బాధ్యత గలిగిన అధికారి అబద్ధాలు చెప్పడం ఏమిటని, అన్ని బాగుంటే ఖమ్మంలో ఆస్పత్రి ఎదుట అంబులెన్స్ లు ఎందుకు వెయిటింగ్‌లో ఉన్నాయని ప్రశ్నించారు.

బుధవారం సీఎల్పీలో భట్టి మీడియాతో మాట్లాడారు. క‌రోనా వైరస్‌తో రాష్ట్రం అత‌లాకుత‌లమవుతోందని, క‌రోనా బాధిత‌ులు ఆక్సిజన్ లేక చనిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఒకచోట బెడ్లుంటే ఇంజెక్షన్ లేదని, ఇంజెక్షన్ ఉంటే ఆక్సిజన్ లేదని, రాష్ట్రంలో ఇలాంటి పరిస్థితి ఉంటే పాలన మొత్తం పడకేసిందని ఆరోపించారు. రాజకీయ కక్ష సాధింపులో ఉన్నారని, రాజకీయ అంశాలు మినహా అన్నింటిలో నిర్లక్ష్యంగా ఉంటున్నారని మండిపడ్డారు. యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టాల్సింది పోయి ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో అర్ధాంతరంగా ఆరోగ్య శాఖ మంత్రిని తీసేశారని దుయ్యబట్టారు.

రాష్ట్రంలో టెస్టులు లేవని, కరోనా వ్యాక్సిన్ లేదని, తెలంగాణ రాష్ట్రానికి దౌర్భాగ్య పరిస్థితి పట్టిందని, సీఎం దగ్గర శాఖ పెట్టుకుని ఏం సమీక్ష చేశారని ఎద్దేవా చేశారు. నిండు సభలో కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చుతామని మాటిచ్చి మరిచిపోయారని విమర్శించారు. ఏడాది కిందట సీఎం వేసిన టాస్క్‌ఫోర్స్ ఉందో, పని చేస్తుందో ఎవరికీ తెలియదని ఎద్దేవా చేశారు. సీఎం అపాయిట్‌మెంట్‌కి లేఖ రాస్తున్నామన్నారు. రాష్ట్ర పరిస్థితులను వివరించేందుకు గవర్నర్ అపాయింట్‌మెంట్‌ కూడా అడిగామని చెప్పారు. ప్రైవేట్ ఆసుపత్రులకు శవాన్ని పెట్టుకుని వ్యాపారం చేస్తున్నారని మండిపడ్డారు.

ప్రజల కోసం యుద్ధం చేస్తాం : జగ్గారెడ్డి

రాష్ట్రంలో ప్రజలు ఆక్సిజన్​ అందక చనిపోతున్నారని, సీటీస్కాన్​ యంత్రాలు లేవని, ఉన్నా అవి పని చేయడం లేదని కాంగ్రెస్​ ఎమ్మెల్యే భట్టి విక్రమార్క అన్నారు. రాష్ట్రంలో పరిస్థితులు సీఎంకు కనిపించడం లేదని, అధికారులు సీఎంకు ఏం చెప్తున్నారనే అనుమానాలున్నాయన్నారు. సీఎం అపాయింట్​మెంట్​ ఇవ్వకుంటే యుద్ధమే చేస్తామని, ప్రతిపక్షాల సలహాలు తీసుకుని ప్రజలకు మేలు చేయాలని, లేదంటూ ప్రజల పక్షాన ఉద్యమం చేస్తామన్నారు.

Next Story

Most Viewed